వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా బయోటెక్‌ దృష్టి

14 May, 2020 12:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌కు దాదాపు 1000 కంపెనీలు దృష్టి పెట్టాయని శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షిటీవీతో మాట్లాడుతూ..  వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా బయోటెక్‌ దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మధ్యలో కానీ చివరలో కానీ వాక్సిన్‌ రావచ్చని ఆయన చెప్పారు. రక్షణ విభాగానికే  బడ్జెట్ నిధులు ఎక్కువగా కేటాయించారని ఆయన అన్నారు. వార్షిక బడ్జెట్‌లో విద్య, వైద్యం,ఆరోగ్యం పట్ల చిన్నచూపు ఉందని తెలిపారు. ఇకపై భవిష్యత్‌లో ఆరోగ్యంపై ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.  మేక్ ఇన్‌ ఇండియా పిలుపు మేరకు ఆవిష్కరణలు జరగాలని వరప్రసాదరెడ్డి చెప్పారు.

దేశంలో వైద్యుల సంఖ్య పెరగాలని, కరోనా వంటి వివత్తుల కోసం ప్రత్యేక వైద్య బృందాలు ఉండాలని వరప్రసాదరెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రాల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచడం అవసరని ఆయన తెలిపారు. భవిష్యత్ అంతా జీవ సాంకేతిక ఆయుధాలదే అని ఆయన చెప్పారు.  భవిష్యత్‌లో ఎవరూ మిస్సైల్స్, ఆయుధాలు వాడరు, అంత ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. భవిష్యత్ దృష్ట్యా అవసరాలు మారాలని ఆయన పేర్కొన్నారు. మేథో సంపత్తిని ప్రోత్సహిస్తే ఆవిష్కరణలు పెరుగుతాయని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ను పొడిగించుకుని కూర్చుంటే ఇంకా ప్రమాదం ఎక్కువని, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందేనని డా. వరప్రసాద్‌రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు