గాంధీ ఫుల్‌.. కరోనా.. కిటకిట

5 Jun, 2020 08:07 IST|Sakshi

వైద్యుల నిష్పత్తికి మించి వస్తున్న రోగులు

విరామం లేకుండా విధులతో అలసిపోతున్న వైద్య సిబ్బంది  

అరకొర వైద్య సేవలతో రోగుల్లోనూ ఆందోళన  

కొత్తగా వచ్చే రోగులపైనా తర్జనభర్జన

సాక్షి, సిటీబ్యూరోకరోనా రోగులతో గాంధీ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది. నిష్పత్తికి మించి రోగులు అడ్మిట్‌ కావడంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ బారిన పడిన రోగుల్లో 14 రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోవడం, గత వారం రోజుల నుంచి రోజుకు సగటున 200 మంది వస్తుండటం, మూడు నెలలుగా విరామం లేకుండా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది శారీరకంగా, మానసికంగా  తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో హైపర్‌టెన్షన్, మధుమేహం, కేన్సర్, కిడ్నీ, గుండె, కాలేయ, సమస్యలతో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నారు. వీరిలో వృద్ధులసంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.   సాధారణ రోగులతో పోలిస్తే..రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, బీపీ, షుగర్‌ బాధితులపై కరోనా వైరస్‌ ఎక్కువగా ప్రభావం చూపుతున్న కారణంగా అనేక మంది మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.  

అదనపు పడకలు సరే, వైద్యులేరీ ?
నిజానికి గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో వెయ్యి పడకల సామర్థ్యం మాత్రమే ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆస్పత్రిలో పడకల సామర్థ్యాన్ని 1500కు పెంచారు. వారం రోజుల నుంచి రోజుకు సగటున 150 నుంచి 200 వరకు కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆస్పత్రిలోని పడకలన్నీ దాదాపు నిండిపోయాయి. దీంతో అదనంగా 350 పడకలు ఏర్పాటు చేసేందుకు గాంధీ యంత్రాంగం సిద్ధమైంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో  కొత్తగా వచ్చే వారిని ఎక్కడ పెట్టాలనే అంశంపై డాక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు. పడకల నిష్పత్తికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆ మేరకు వైద్య సిబ్బందిని కూడా నియమించక పోవడంతో విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. వైద్యులు రాసిన మందులను మంచంపై పడేయడం, ఆహారాన్ని కనీసం చేతికి కూడా ఇవ్వకుండా ఓ చోట వదిలి వెళుతుండడం లాంటి ఘటనలు  రోగులను మానసికంగా కుంగదీస్తున్నాయి. కరోనా సెంటర్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి మే 3వ తేదీ వరకు కరోనా పాజిటివ్‌ లక్షణాలతో 3020 మంది రోగులు చేరగా, వీరిలో విదేశీయులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 448 ఉన్నారు.   

శారీరక, మానసిక ఒత్తిడితో వారియర్స్‌ సతమతం  
కోవిడ్‌–19 నిబంధనల ప్రకారం మొత్తం వైద్య సిబ్బందిలో సగం మంది విధుల్లో ఉంటే..మరో సగం మంది క్వారంటైన్‌లో ఉండాలి. మూడు షిప్ట్‌ల చొçప్పున విధులు నిర్వర్తించాలి. అంటే ప్రతి షిప్ట్‌లో 230 మందే ఉంటారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు సత్వరమే వైద్యసేవలు అందించలేని దుస్థితి నెలకొంది. అంతే కాదు  మూడు నెలల నుంచి ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి రోగులకు సేవలు అందించడంతో కోవిడ్‌ వారియర్స్‌ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.  రోజంతా పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్యుప్‌మెంట్‌ కిట్‌లను ధరించి ఉండాల్సి వస్తుండటం వల్ల వారు వివిధ రకాల చర్మవ్యాధుల భారిన పడుతున్నారు. ఆస్పత్రిలో రోగుల రద్దీ పెరగడం, విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తోంది.   

మే 3వ తేదీ వరకు గాంధీలో కరోనా పాజిటివ్‌ రోగులులెక్క ఇలా
3020 నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసులు
1556 కోలుకుని డిశ్చార్జి అయిన వారు
1365 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు
99 కరోనాతో చనిపోయిన వారు

ఇదీ గాంధీ ముఖ చిత్రం
ఆస్పత్రి పడకల సామర్థ్యం    1500
అదనంగా ఏర్పాటు చేస్తున్న పడకలు    350
వైద్యులు    350
పీజీలు, ఇంటర్నీస్, హౌస్‌ సర్జన్లు    450
రెగ్యులర్‌ స్టాఫ్‌ నర్సులు    150
కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు    200
శానిటేషన్, సెక్యూరిటీ,ఇతర ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు    2000
కోవిడ్‌ విధుల్లో ఉన్న వైద్య విభాగాలు: జనరల్‌ మెడిసిన్, ఎమర్జెన్సీ, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ,  గైనకాలజీ

మరిన్ని వార్తలు