వామ్మో.. అక్కడా..!

11 Jul, 2020 08:14 IST|Sakshi

కోవిడ్‌ సెంటర్లలో పనిచేసేందుకు నిరాసక్తత

ప్రశ్నార్థకంగా టిమ్స్‌.. గాంధీలోనూ ఇదే పరిస్థితి

వైద్యులే కాదు... స్టాఫ్‌ నర్సులు.. టెక్నీషియన్ల కొరత

సాక్షి, సిటీబ్యూరో: కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరినుంచి వస్తుందో అర్థంకాక జనం బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కోవిడ్‌ సెంటర్లలో పనిచేసేందుకు సిబ్బంది కూడా వెనుకంజ వేస్తున్నారు. రెగ్యులర్‌ ప్రాతిపదికన పని చేస్తున్న వారు మినహాయిస్తే..కాంట్రాక్ట్,  అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల కింద పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల్లో ఇప్పటికే 30 శాతం మంది అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండానే మానేస్తున్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారు భయంతో విధులకు దూరంగా ఉంటుంటే...ప్రభుత్వం ఆయా సెంటర్లలో రెగ్యులర్‌ కాకుండా తాత్కాలిక ప్రతిపాదికన చేపడుతున్న నియామకాలకు స్పెషాలిటీ వైద్యులు సహా టెక్నీషియన్లు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పటికే గచ్చిబౌలిలోని 14 అంతస్తుల్లో 1500 పడకలతో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(టిమ్స్‌)పరిస్థితి ప్రశ్నా ర్థకంగా మారింది. పది రోజుల క్రితమే సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఇది అందుబాటులోకి రాకపోవడానికి ఇదే కారణమని తెలిసింది. ఉస్మానియా సహా ఇతర టీచింగ్‌ ఆస్పత్రులు, జిల్లాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందిని డిప్యూటేషన్‌పై ఇప్పటికే కొంత మందిని ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ..వారు కూడా ఇక్కడ పని చేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తుండటం విశేషం.

ఆ స్టాఫ్‌ నర్సుల్లో ఆందోళన
తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(టిమ్స్‌) సహా గాంధీ, కింగ్‌కోఠి, చెస్ట్‌ సహా పలు కోవిడ్‌ సెంటర్లలో విధులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సుల నియమాకా నికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. చాలా మంది స్టాఫ్‌ నర్సులు ధైర్యంతో ఇక్కడ పని చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కాంట్రాక్ట్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. 152 మందిని ఎంపిక చేసి, వీరిలో కొంత మందిని గాంధీ కోవిడ్‌ సెంటర్‌కు పంపింది. ఆ మేరకు వారంతా ఇటీవల గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. కాంట్రాక్ట్‌ ప్రతిపాదిక కింద ఇటీవల ఎంపిక చేసిన నర్సులకు తీరా ఆస్పత్రికి చేరుకున్న తర్వాత అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ కింద నియమించినట్లు తెలిసి వారు ఆందోళనకు దిగారు.‘గాంధీ’లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రాణాలను రిస్క్‌లో పెడతారా?  
నిజానికి ఒక డాక్టర్‌ ప్రొఫెసర్‌ స్థాయికి చేరుకోవాలంటే కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. వీరంతా ఇప్పటికే ఎక్కడెక్కడో సెటిలైపోయారు. ఇలాంటి వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి... కేవలం ఏడాది తాత్కాలిక ఉద్యోగం కోసం టిమ్స్‌కు ఎలా వస్తారు?  కోవిడ్‌ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క ఏడాది కోసం ఏ డాక్టరైనా తమ ప్రాణాలను ఫణంగా పెడతాడా?  ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? ఏపీలో వేల పోస్టులను రెగ్యులర్‌ బేసిస్‌పై రిక్రూట్‌మెంట్‌ చేస్తుంటే..తెలంగాణలో మాత్రం తాత్కాలిక పేరుతో నోటిఫికేషన్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసం?  – డాక్టర్‌ శ్రీనివాస్, ప్రతినిధి,తెలంగాణ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా