గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు

10 Jul, 2019 08:01 IST|Sakshi

ఒక్కో కేసుకు రూ.6 వేల నుంచి రూ.10 వేలు

ఆడపిల్లని తేలితే అబార్షన్‌కు మరో రూ.10వేలు

సాక్షి, నల్లగొండ టౌన్‌: జిల్లా కేంద్రంలో లింగనిర్ధారణ పరీక్షల దందా మూడు పూలు..ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డులోనే అధికారుల కళ్లు గప్పి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లింగనిర్ధారణ పరీక్షలను కొనసాగిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను పెంచుకుందామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించి ఆడపిల్ల అని తేలితే తల్లికడుపులోనే చిదిమేస్తున్న తీరు బాధాకరం.

ఇప్పటికే ప్రతి వెయ్యిమంది బాలురకు కేవలం 922 మంది బాలికలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖగణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొందరు వైద్యులు సిండికేట్‌గా ఏర్పడి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ స్కానింగ్‌ సెంటర్‌ను ప్రోత్సహిస్తూ లింగనిర్ధారణ పరీక్షల కోసం కేసులను రెఫర్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్‌ సెంటర్‌లో భాగస్వాములుగా ఉన్న వైద్యులతోపాటు మరికొంత మంది వైద్యులు స్కానింగ్‌ల పేరుతో గర్భిణులను పంపించి గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలను చేయిస్తున్నారన్నది విశ్వసనీయ సమాచారం. 

గర్భిణి వెంట వచ్చిన వారిని మాటల్లో కలిపి.. 
ప్రతి గర్భిణి నెలనెలా వైద్య పరీక్షల కోసం వైద్యుల వద్దకు వెళ్తుంటారు. బిడ్డ ఎదుగుదలకు వెళ్లిన సమయంలో డాక్టర్లు వారి అమాయకత్వాన్ని, బిడ్డ ఆడ, మగ తెలుసుకోవాలన్న ఆతృతను గమనిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని స్కానింగ్‌ తీయించుకోమని ఉచిత సలహా ఇవ్వడంతోపాటు నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రం నడిబొడ్డులో గల స్కానింగ్‌ సెంటర్‌కు రెఫర్‌ చేస్తున్నారు. చెకప్‌కు వచ్చే వారి తల్లినో, అత్తనో మాటలలో కలిపి ఆడపిల్ల, మగబిడ్డ అని తెలుసుకోవాలని ఉందా అని అడిగి..వారు ఒకే అన్న వెంటనే సదరు స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చి స్కానింగ్‌లో లింగనిర్ధారణ చేసి తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నట్లు తెలుస్తోంది.

స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు గర్భిణులకు విషయం తెలియజేయకుండా కేవలం రెఫర్‌ చేసిన వైద్యులకే లింగనిర్ధారణ రిజల్ట్‌ను వెల్లడిస్తారు. దీంతో అడపిల్ల అని తేలిందని, ఆడపిల్లకావాలా వద్దా అని వారిని అడిగి వద్దు అని సమాధానం వచ్చిన వెంటనే అబార్షన్‌ చేయించుకోవాలని, దానికి రూ.10 నుంచి రూ15 వేల వరకు, లింగనిర్ధారణలో ఆడ, మగ అని చెప్పినందుకు రూ. 6 నుంచి రూ.10 వేల వరకు వారి వారి స్థాయిని బట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారిపై ఉన్న పట్టణాలలో మొబైల్‌ స్కానింగ్‌ వాహనాలను తీసుకువచ్చి లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించడం విశేషం.

ప్రతి నిత్యం పదుల సంఖ్యలో లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నప్పటికి సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అంతరించి పోతున్న ఆడపిల్లలను రక్షించుకోవాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు , లింగనిర్ధారణ పరీక్షలను నివారించకపోతే ఆడపిల్లలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది.

ఆర్‌ఎంపీలు కూడా అక్కడికే..
ఇప్పటికే ఒక ఆడపిల్ల ఉండి మరోమారు గర్భం దాల్చిన మహిళలు మగపిల్లాడు కావాలని కోరుకుంటారు. అలాంటి వారిని గ్రామాల్లోని ఆర్‌ఎంపీలు గుర్తించి వారికున్న పరిచయంతో  ఆ స్కానింగ్‌ సెంటర్‌కే రెఫర్‌ చేస్తుండడం గమనార్హం. ఇలా ప్రతి కేసుకు సదరు ఆర్‌ఎంపీలకు కమీషన్‌ వెళ్తుంది.    

మరిన్ని వార్తలు