టార్గెట్ పూర్తయింది..వెళ్లండి!

16 Sep, 2014 23:42 IST|Sakshi

వర్గల్: నిన్న మొన్నటి దాకా రివార్డులు, అవార్డులంటూ మహిళలను బతిమాలి కుటుంబ నియంత్రణ శిబిరానికి తరలించిన వైద్యులు తమ వైఖరి మార్చుకున్నట్లు తెలిసింది. మంగళవారం వర్గల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం వచ్చిన సగానికి పైగా మహిళలను టార్గెట్ పూర్తయిందని, మలి విడత క్యాంపులో ఆపరేషన్లు చేయించుకోవాలని తిప్పి పంపారు.

ఉదయం నుంచి ఆస్పత్రి ఎదుట పసిపాపలతో పడిగాపులు గాసిన మహిళలు వైద్యాధికారుల వ్యాఖ్యలతో దిగ్భ్రాంతికి గురయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఉసూరుమంటు వెళ్లిపోయారు. సాధారణంగా వర్గల్‌లో నిర్వహించే కుటుంబ నియంత్రణ ప్రత్యేక శిబిరానికి మండలంతోపాటు, ములుగు, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల నుంచి కూడా మహిళలు వస్తుంటారు.

లక్ష్యాన్ని సాధించేందుకు  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలకు నగదు పారితోషికాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందజేస్తోంది. మరోవైపు శిబిరానికి మహిళలను తరలించే విధంగా ఏఎన్‌ఎం, ఆశాజ్యోతి వర్కర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అర్హులైన తల్లులకు నచ్చచెప్పి, బతిమాలి శిబిరాలకు తరలిస్తుండడం ఏఎన్‌ఎం, ఆశ వర్కర్ల విధిలో ప్రధానమైంది. ఈ క్రమంలో మంగళవారం వర్గల్ శిబిరానికి 150 మందికి పైగా మహిళలు వచ్చారు.

 గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆర్టీసీ బస్సు సౌకరం లేకపోవడంతో తెల్లవారే సరికి ఆటోల్లో చంటిపిల్లలతో వర్గల్ చేరుకున్నారు. వారిలో 75 మందికి మాత్రమే ఆపరేషన్లు చేసేందుకు రిజిష్టర్ చేసుకున్నారు. క్యాంపునకు సరిపడిన సంఖ్య పూర్తయిందని, ఇక ఖాళీలు లేవని, తరువాత నిర్వహించే క్యాంపునకు రావాలని వైద్యులు వారితో కరాఖండిగా చెప్పారు. దీంతో జగదేవ్‌పూర్, గజ్వేల్ తదితర ప్రాంతాలనుంచి వచ్చిన మహిళలు కొద్దిసేపు వైద్య సిబ్బందితో వాదనకు దిగారు. ఉదయం నుంచి పడిగాపులు గాశామన్నారు. వారి బాధలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు.

 గింత అన్యాలమా..పద్మ (ఎర్రవల్లి)
 వర్గల్ క్యాంపుల ఆపరేషన్ చేస్తరంటె పొద్దుగాల పొద్దుగాలనే ఆటోల వర్గల్‌కు వచ్చినం. పగటాల్దాక దవాఖాన ముందర నిర్ర నీలిగినం. ఆపరేషన్లకు ఎక్కువ మంది ఒచ్చిన్రని నన్ను పట్టించుకోలె. చంటి పిల్లను పట్టుకుని గింత దూరం ఈడ్సుకుంట వస్తె మల్ల క్యాంపునకు రమ్మని ఎల్లగొట్టిండ్రు. పైసల్ ఖర్సాయే..కష్టం తప్పకపాయె. ఊరుగాని ఊరునుంచి వస్తే తమాం గింత అన్యాలమా. ముందే చెపితె గింత తిప్పల పడకపోతుంటిమి. గరీబోల్లను గిట్ల పరేషాన్ చేయకుండ్రి.

 అధికారుల ఆదేశాల మేరకే... - డాక్టర్ సిల్వియా
 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం వచ్చిన మహిళలను తిప్పిపంపిన మాట వాస్తవమే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కు.ని. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి గతంలో 150కి పైగా శస్త్ర చికిత్సలు జరిపిన సందర్భాలున్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సంఖ్యను 80కి మించకుండా జిల్లా అధికారులు కుదించారు. వారి ఆదేశాలకు అనుగుణంగానే వర్గల్ శిబిరంలో 75 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరిపాం. మిగతా వారు తరువాతి శిబిరంలో శస్త్ర చికిత్స జరిపించుకోవాలని నచ్చచెప్పి పంపించాం.

మరిన్ని వార్తలు