భాను మృతిచెందలేదు...

2 Feb, 2019 10:08 IST|Sakshi
భానుకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌

సమన్వయలోపంతోనే సమస్య

గాంధీ వైద్యుల స్పష్టీకరణ

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో బతికున్న యువకుడిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని మీడియాలో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని, సమన్వయలోపంతోనే బాధిత యువకుని కుటుంబసభ్యులు తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. బాధితునికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రి సెమినార్‌ హాలులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆర్‌ఎంఓలు జయకృష్ణ, శేషాద్రి, సత్యరత్నలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పటాన్‌చెరువుకు చెందిన భాను (19) గతనెల 30వ తేదిన గాంధీ ఆస్పత్రిలో చేరాడని, అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, అదే విషయాన్ని భాను కుటుంబసభ్యులకు వివరించామన్నారు.

31వ తేదీ మధ్యాహ్నం వైద్యపరీక్షలు నిర్వహించి పల్స్‌ అందడంలేదని, హార్ట్‌ వీక్‌గా ఉందని చెప్పామని, దీన్ని భాను కుటుంబసభ్యులు మరో విధంగా అర్ధం చేసుకున్నారని వివరించారు. ఎంఎల్‌సీ కేసుల్లో మృతి చెందితే ఘటన జరిగిన ప్రాంతానికి చెందిన పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తామన్నారు. భాను మృతి చెందినట్లు భావించిన అతని కుటుంబసభ్యులే పోలీçసులకు సమాచారం ఇచ్చారని, తమ కేస్‌షీట్‌లోగాని మరెక్కడ కూడా భాను మృతి చెందినట్లు ధృవీకరించలేదన్నారు. సమన్వయలోపంతోనే సమస్య ఉత్పన్నం అయినట్లు స్పష్టం చేశారు. ప్రస్థుతం టీఎంటీ వార్డులో భానుకు వైద్యచికిత్సలు అందిస్తున్నామని, విషమంగా ఉందన్నారు. న్యూరోసర్జరీ హెచ్‌ఓడీ ప్రకాశరావు స్వయంగా పరీక్షలు నిర్వహించి ఆపరేషన్‌ చేసేందుకు కూడా అవకాశంలేదన్నారని తెలిపారు. మీడియాలో వార్తలు ప్రచురించే ముందు ఆస్పత్రి పాలన యంత్రాంగం వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ సూచించారు.

మరిన్ని వార్తలు