ఓపిక ఉంటేనే రండి!

11 Oct, 2019 11:23 IST|Sakshi
సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రోగుల పాట్లు

స్కానింగ్‌కు మూడు నెలల సమయం

ఈలోగా రోగం ముదిరి ప్రాణాలమీదకు..  

డిస్పెన్సరీల్లో మందులు నిల్‌

స్టాండింగ్‌ కమిటీ కన్నెర్రజేసినా మారని అధికారులు

అమీర్‌పేట: ప్రజా ప్రతినిధులు హెచ్చరించినా, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు వారించినా సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అధికారుల తీరు మారడం లేదు. వారి ప్రవర్తనతో ఆస్పత్రికి వస్తున్న రోగులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చికిత్స నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్టుగా వైద్యసేవలు అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఒక రోజు సెలవుపెట్టి ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సిన పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. పరీక్షల కోసం నెలల తరబడి ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి రావడంతో సకాలంలో వైద్యం అందటం లేదని ఈఎస్‌ఐ లబ్ధిదారులు వాపోతున్నారు.

అత్యవసరంగా చేయాల్సిన ఎంఆర్‌ఐతో పాటు ఇతర స్కానింగ్‌లకు సైతం కనీసం మూడు నెలల కాలం ఆగాల్సి వస్తోందని, ఈలోగా రోగం ముదిరిపోయి ప్రాణాలమీదకు వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన వారికి రోగం నయం కాకముందే డిచ్చార్జి చేస్తున్నారు. అదేమని అడిగితే బెడ్లు ఖాళీ లేవని సమాధానం ఇస్తున్నారని ఓ రోగి బంధువు వాపోయాడు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెబుతున్న పాలకుల మాటలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇక ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో సైతం మందుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రోగులు వాపోతున్నారు. ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు రోగులు స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేయగా కమిటీ  సభ్యులు అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. ఇక సెక్యూరిటీ సిబ్బంది రోగుల సహయకుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రి లోపలికి వెళ్లిన ప్రతిసారి జైల్లో విచారణ ఖైదీలను తనిఖీ చేసినట్టు చేస్తున్నారు.

వాహనాలకు పార్కింగ్‌ లేదు..  
ఆస్పత్రికి వచ్చే రోగుల వాహనాలకు ప్రాంగణంలో భద్రత లేకుండా పోతోంది. వైద్యం కోసం ఓపీ బ్లాక్‌కు వచ్చే రోగుల వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు వీలుగా మెడికల్‌ కళాశాల కింద ఉన్న డబుల్‌ సెల్లార్‌లో స్థలం కేటాయించారు. ఆస్పత్రి అధికారులు, వైద్యులు కూడా తమ వాహనాలను ఇక్కడే పార్కింగ్‌ చేస్తుంటారు. అయితే తమ వాహనాలు ధ్వంసం చేస్తున్నారన్న సాకుతో రోగుల వాహనాలను సెల్లార్‌లోకి అనుమతించడం లేదు. ఓపీ బ్లాక్‌కు వచ్చే వాహనాలు సుమారు కిలో మీటరు దూరంలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సెల్లార్‌లోకి పంపిస్తున్నారు. దీంతో అక్కడి వరకు వెళ్లేందుకు ఓపికలేక చాలా మంది ఆస్పత్రి బయట రోడ్లపై నిలుపుతున్నారు. మెడికల్‌ కళాశాల సెల్లార్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మద్యం తాగి వాహనాలను ధ్వంసం చేయడంతో రోగుల వాహనాలను అనుమతించడం లేదని మెడికల్‌ కళాశాల డీన్‌ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా