ప్రభుత్వ ఆస్పత్రులకు సుస్తీ!

16 Nov, 2019 10:00 IST|Sakshi
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం

వేళకు రాని డాక్టర్లు....రోగులకు సిబ్బందే దిక్కు

సీజనల్‌ వ్యాధులకు మందులు కరువు

గర్భిణిలకు పంపిణీ చేసే పథకాల్లోనూ చేతివాటం   

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: రోగులకు వైద్య సేవలందించాల్సిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. సమయానికి రాని డాక్టర్లు, సిబ్బందికి తోడు సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన మందులు లేక రోగులకు సరైన వైద్యం అందటం లేదు. బీపీ, షుగర్‌ మందులు దొరకటం లేదు. సబ్‌ స్టాఫ్‌ కొరతతో మెయింటెనెన్స్, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. జిల్లాలో ఘట్‌కేసర్‌లో 50 పడకలు, మేడ్చల్‌లో 30 పడకల కమ్యూనిటీ ఆసుపత్రులతో పాటు పది పీహెచ్‌సీలు, 24 యూపీహెచ్‌సీలు, 103 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. అయితే..మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా జనాభాకు అనుగుణంగా ఒక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రితోపాటు మూడు కమ్యూనిటీ ఆసుపత్రులు, నాలుగు ట్రామా సెంటర్లు, 28 యూపీహెచ్‌సీల కోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనల నివేదించినప్పటికీ, ఇప్పటి వరకు మంజూరు కాలేదు. మూడు ఆరోగ్య కేంద్రాలోల్‌ డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 40  పారా మెడికల్, పలు ఆశ వర్కర్స్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఒక్కో  పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీకి నెలకు రూ.50 వేల చొప్పున ఏడాదికి రూ.6 లక్షలు మందుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.

ఆసుపత్రుల తీరు ఇలా...  
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు...మేడ్చల్‌ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి(సీహెచ్‌సీ)లో వసతులు ఉన్నప్పటికీ డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందటం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఘట్‌కేసర్‌ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది సమయానికి రాక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 24 గంటలు(రౌండ్‌ ది క్లాక్‌) ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవటం వల్ల రోగులు రాని పరిస్థితి నెలకొంది. పలు ఆసుపత్రుల్లో మొక్కుబడిగా సాయంత్రం ఓపీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆసుపత్రులకు వచ్చిన రోగులకు కూడా నాసిరకం మందులు అందిస్తుండటంతో రోగాలు నయం కావటం లేదని పేర్కొంటున్నారు. ఆరోగ్య కేంద్రాలకు బయటి రోగులు వస్తున్నప్పటికీ సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన మందులు దొరకడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

తనిఖీలు చేసినా మారని వైనం....  
జిల్లాలో పలు ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది సమయ పాలన పాటించకపోగా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో గతంలో నారపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రజాఆరోగ్య శాఖ డైరెక్టర్‌  ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్‌తో సహా సిబ్బంది అందుబాటులో లేకపోటంతో  సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఉన్నతాధికారులు నేరుగా తనిఖీలు జరిపి చర్యలు తీసుకునేంత వరకు జిల్లా వైద్యాధికారులు స్పందించని తీరుపై అప్పట్లో జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌ అయింది. దీంతోడీఎంహెచ్‌ఓతోసహా పలువురు అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రెగ్యులర్‌గా తనిఖీ చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ అవి మొక్కుబడిగా సాగుతున్నట్లు తెలుస్తున్నది.

కేసీఆర్‌ కిట్స్‌... మిగతా పథకాలు అంతే..
గర్భిణిలకు కేసీఆర్‌ కిట్స్‌తో పాటు అర్హులైన వారికి నాలుగు విడతలుగా అబ్బాయి పుడితే రూ.12 వేలు, అమ్మాయి పుడితే రూ.13 వేలు అందించటంలో కూడా జిల్లా వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. జనవరి నుంచి ఆగస్టు వరకు 55,127 మంది లబ్ధిదారులకు గానూ 49,579 మందికి మాత్రమే కేసీఆర్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. ఇక బాలుడు, బాలిక పుడితే అందించే డబ్బుల విషయంలో కొందరు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తున్నది. జననీ సురక్ష యోజన పథకం కింద మాతా శిశు మరణాల రేటు తగ్గించటానికి గ్రామీణ ప్రాంత గర్భిణిలకు రూ.700, పట్టణ ప్రాంత గర్భిణిలకు రూ.600 పంపిణీలో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. జననీ సు రక్ష కార్యక్రమం కింద తెల్ల రేషన్‌ కార్డు కలిగిన గర్భ ణిలకు ఉచిత పరీక్షల నిర్వహణ, మందుల పంపిణీ, ఉచిత భోజనం, ఉచిత రవాణా సౌకర్యం వంటి వాటికి కేటాయించే నిధుల్లో కూడా సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవటం వల్లనే ఇదంతా జరుగుతుందని అధికారయంత్రాంగం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు