నరకం చూపించారు సార్‌!

5 Sep, 2018 11:24 IST|Sakshi
బిడ్డతో బాధితురాలు అఫ్రీన్‌

ప్రసవం కోసం వస్తున్న గర్భిణుల పట్ల జిల్లాకేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పురిటినొప్పులు వచ్చినా.. వైద్యులతోపాటు సిబ్బంది కూడా పట్టించుకోవడంలేదు. సాధారణ కాన్పు అవుతుదంటూ గర్భిణుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం కూడా ఓ గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతున్నా.. కాన్పు చేయలేదు. దీంతో ఆ గర్భిణికి ఫిట్స్‌ వచ్చింది. వైద్యసిబ్బంది నిర్లక్ష్యాన్ని గమనించిన ఆమె బంధువులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ 10 నిమిషాల్లోనే సాధారణ ప్రసవం చేసి.. మగశిశువుకు పురుడుపోశారు.

కరీంనగర్‌హెల్త్‌: జిల్లాకేంద్రంలోని విజయపురికాలనీకి చెందిన అఫ్రీన్‌ పురిటినొప్పులతో బాధపడుతూ జిల్లాకేంద్ర ఆస్పత్రి ఆవరణలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శనివారం చేరింది. పరీక్షలు చేసిన వైద్యులు.. ప్రసవానికి ఇంకా సమయం ఉందన్నారు. మధ్యాహ్నంవరకు నొప్పులు తీవ్రమైనా.. ఇంకా సమయం ఉందంటూ పట్టించుకోలేదు. నొప్పులు తీవ్రమై కాళ్లు, చేతులు మెలికలు తిరుగుతూ ఫిట్స్‌వచ్చి బాధితురాలు కొట్టుకుంది. పరిస్థితిని గమనించిన బంధువులు నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంకు తరలించారు.  

వెయ్యి కాన్పులు లక్ష్యం అంటూ గొప్పలు..
పేదలకు సత్వర వైద్యం అందించి వెయ్యి కాన్పులు చేయడమే లక్ష్యమని గొప్పలు చెబుతున్న మాతాశిశు ఆరోగ్య కేంద్రం వైద్యులు ఆదిశగా సేవలు అందించడం లేదు. ఆస్పత్రిలో గర్భిణుల పట్ల సిబ్బంది అనుసరిస్తున్న తీరు పరాకాష్ఠకు చేరుతోంది. మాతా, శిశు మరణాలు తగ్గించాలనే సంకల్పంతో రూ.16కోట్లతో  ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో సత్వర సేవలు కాదుగదా.. కనీస సేవలు అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు నిండిన తర్వాత ఆస్పత్రిలో చేర్చుకుంటున్నా.. తర్వాత పట్టింపు కరువైందని, అసలు ఆసుపత్రికి ఎందుకు వస్తున్నారన్నట్లు సిబ్బంది వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న ప్రకటనలకు.. ఆసుపత్రిలో గర్భిణులకు అందుతున్న సేవలకు పొంతన లేకుండాపోతోందని విమర్శిస్తున్నారు. 

నరకం చూపించారు
ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సాధారణ కాన్పు అవుతుందని కాలయాసన చేశారు. మేం కూడా వారికి సహకరించాం. నొప్పులతో తల్లడిల్లుతున్నా.. వైద్యులు పట్టించుకోలేదు. పూటకోడాక్టర్‌.. గంటకోనర్సువచ్చి వెళ్లారు తప్పితే.. వైద్యానికి ఎవరూ ముందుకురాలేదు. ఇంకా టైం ఉందని, తమకు తెల్వదా.. ? అంటూ నరకం చూపించారు. అప్పటికే కాళ్లు, చేతులు వంకరలు పోయి కొట్టుకుంది. ప్రైవేటుకు తీసుకుపోతామంటే సంతకం చేయాలని వేధించారు. వారి నిర్లక్ష్యాన్ని గమనించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాం. ఆలస్యమై ఉంటే ప్రాణాలకు ముప్పు ఉండేది. ప్రభు త్వ ఆస్పత్రి సిబ్బంది తీరు చాలా దారుణం. పేదలకు సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. – సయ్యద్‌ ఖలీం, బాధితురాలి భర్త 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా