అమ్మకెంత కష్టం!

20 Mar, 2018 02:14 IST|Sakshi

ఆపరేషన్‌ వికటించి నెలరోజులుగా నరకయాతన

ఆస్పత్రి ఎదుట బాధితురాలి తల్లిదండ్రుల బైఠాయింపు

కిట్‌ కోసం ఆశపడితే చావుమీదకొచ్చిందని ఆరోపణ

పెద్దపల్లిటౌన్‌: నవమాసాలు మోసి బిడ్డను లోకానికి అందిస్తున్న తల్లులు పడుతున్న నరకయాతనకు రజిత సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రసూతి సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఆమె పాలిట శాపంగా పరిణమించింది. గర్భాశయం నుంచి మాగి తొలగించే ప్రయత్నంలో రజిత ఉదరభాగంలోని పేగు తెగిపోవడంతో మలమూత్రాలు జననాంగం నుంచి వస్తున్నాయి. దీంతో బాధితురాలు నరకయాతన అనుభవిస్తోంది.

పెద్దపల్లి మండలం బొంపల్లికి చెందిన గౌడ సరస్వతీ, నర్సయ్యల కూతురు రజిత ప్రసూతి కోసం ఫిబ్రవరి 14న పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అదే రోజు నర్సు తోటి సిబ్బందితో కలసి సిజేరియన్‌ చేయగా.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రజిత తన కుమారుడిని చూసి సంతోషించే లోపే.. ఆమె జననాంగం నుంచి ఏకకాలంలో రక్తస్రావంతోపాటు మలమూత్రాలు రావడం గమనించి భయంతో వణికిపోయింది. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది బాలింతను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు.

ప్రసూతి సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడం వల్ల స్టాఫ్‌నర్స్‌ రమ్యకృష్ణ, సిబ్బంది కలసి రజితకు పురుడుపోశారు. ఆ సమయంలో మహిళా వైద్యురాలు లీలా అందుబాటులో లేక పోవడంతో తమ కూతురు ప్రాణం మీదకు తెచ్చారని తల్లిదండ్రులు సరస్వతీ, నర్సయ్యలు కలెక్టర్‌ శ్రీదేవసేన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తిరిగి మరోసారి ఎంజీఎంకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని వరంగల్‌ అధికారులను పురమాయించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందించాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.  

కేసీఆర్‌ కిట్‌ కోసం ఆశపడి వెళితే..!
రజిత తల్లిదండ్రులు సరస్వతీ, నర్సయ్య సోమవారం స్థానిక ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న కిట్‌కు, నగదుకు ఆశపడి ఆస్పత్రికి వెళ్తే చావు మీదకు వచ్చిందని వాపోయారు. కలెక్టర్‌ జోక్యం చేసుకున్నా తన కూతురుకు మెరుగైన వైద్యం లభించడం లేదన్నారు. కూతురుకు వచ్చిన కష్టం మరే బిడ్డకు రావొద్దని కన్నీటి పర్యంతమయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.  

మామూలు స్థితికి రాగానే ఆపరేషన్‌
రజితకు ప్రస్తుతం రక్తస్రావమవుతోంది. పేగులు పచ్చిగా ఉండటంతో ఆపరేషన్‌ చేయడం సాధ్యం కాదు. దీంతో ఆమెకు మెరుగైన చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిపుణులైన వైద్యులతో శస్త్రచికిత్స చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంజీఎంలో సైతం చికిత్సకు నిరాకరించి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడం వల్ల ఇబ్బంది పడుతున్నారు.      – మల్లేశం, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

లక్షలో ఒకరికి ఇలాంటి ఆపద
రజితకు వచ్చిన ఆపద లక్షలో ఒకరికి వస్తుంది. ప్రసూతి సమయంలో బేబి సైజు పెద్దది కావడంతో ఇలా జరిగింది. అయినా పెద్ద ప్రమాదమేమీ లేదు. తిరిగి సర్జరీ ద్వారా రజితను మామూలు స్థితిలోకి తీసుకురావచ్చు. ఆందోళనకు గురై అవగాహన లేక ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఘటనపై విచారణ కూడా జరుపుతున్నాం.
– ప్రమోద్, డీఎంహెచ్‌వో, పెద్దపల్లి

మరిన్ని వార్తలు