నిమ్స్‌ వైద్యుడిపై దాడి

21 May, 2019 08:45 IST|Sakshi

రక్షణ కల్పించాలంటూ వైద్యుల ఆందోళన కేసు నమోదు

సోమాజిగూడ: నిమ్స్‌ ఆసుపత్రి వైద్యునిపై రోగి బంధువులు దాడికి పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు నిరసనగా రెసిడెంట్‌ వైద్యులు ఆందోళన చేపట్టారు. బాధితుడు, సీఎంఓ డాక్టర్‌ అన్వేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం 4.30 ప్రాంతంలో ఓ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన నిఖిల్‌ అనే యువకుడు చికిత్స నిమిత్తం నిమ్స్‌ అత్యవసర విభాగానికి వచ్చిడు. అతనితోపాటు మరో 15 మంది వ్యక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సీఎంఓ డాక్టర్‌ అన్వేష్, రెసిడెంట్‌ డాక్టర్‌ అనీస్‌ ఫాతిమా అతడికి ప్రథమ చికిత్స నిర్వహించి సీటీ స్కాన్‌కు పంపుతుండగా...వారి వెంట వచ్చిన యువకుల్లో ఒకరు ఎంతసేపు వైద్యం చేస్తారంటూ తమతో అకారణంగా గొడవకు దిగారన్నారు.

తమకు నగరంలోని ఒక ముఖ్య నేత అండ ఉందని దుర్భాషలాడుతూ తనను నెట్టినట్లు తెలిపాడు. దీంతో ఆగ్రహానికి లోనైన రెసిడెంట్‌ డాక్టర్లు ఆస్పత్రిలో వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ అత్యవసర విభాగం ఎదుట ఆందోళన చేపట్టారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గౌతం, కన్వీనర్‌ డాక్టర్‌ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్‌ కౌశిక్‌ మాట్లాడుతూ ఆస్పత్రి వద్ద 260 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరం ఉండగా..కేవలం 60 మందితో కాపలా చేపడతున్నారన్నారు. ఆసుపత్రి యాజమాన్యం తమకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. గతంలోనూ రెండు సార్లు వైద్యులపై దాడులు జరిగాయని, తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. ఘటనపై వైద్యురాలు అనీస్‌ ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్‌ ఏసీపీ కె.ఎస్‌.రావ్,  సీఐ మోహన్‌కుమార్‌ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

నిందితులను శిక్షించాలి: బొంతు శ్రీదేవి  
నిమ్స్‌ వైద్యునిపై దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని నగర మేయర్‌ సతీమణి బొంతు శ్రీదేవి అన్నారు. సోమవారం ఆమె వైద్యులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.  కాగా ఈ ఘటనలో ముగ్గురు నిందితులు సందీప్, సుశీల్, విజయ్‌ లను సోమవారం రాత్రి పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు