కరోనాపై యుద్ధానికి వైద్య దళం

27 Mar, 2020 01:23 IST|Sakshi

వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా సర్కారు చర్యలు

వైద్యులు, సిబ్బంది 3 బ్యాచ్‌లుగా విభజన

ఐదేసి రోజుల చొప్పున ఒక్కో బ్యాచ్‌ విధులు 

సాక్షి, హైదరాబాద్‌ : కరోనాపై యుద్ధానికి ఇప్పుడు ప్రభుత్వం ఆర్మీ తరహా విధానం ఆచరించడానికి సిద్ధమైంది. ఉన్న వైద్య సిబ్బంది నుంచే రిజర్వుడు దళాన్ని తయారు చేయాలని భావిస్తోంది. కరోనా కేసులకు చికిత్స అందిస్తోన్న వైద్యుల సేవలను దశల వారీగా వినియోగించుకోవడం ఇందులోని ఉద్దేశం. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం, పలువురు అనుమానితులు ప్రభుతాస్పపత్రులకు వస్తుండటంతో సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో, కొన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసింది. వాటిల్లోని బాధితులకు వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది నిరంతరం చికిత్సలు అందిస్తున్నారు.  (డాక్టర్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌)

ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుల్లో ఎవరికైనా కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చి, ఇతర సిబ్బందికీ అంటుకుంటే వైద్యం చేసేవారే ఉండని పరిస్థితి.. ఇటలీలో కరోనా బాధితులకు వైద్యం చేసిన 14 శాతం మంది డాక్టర్లకు పాజిటివ్‌ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. దీంతో మన దగ్గర వైద్యులు, ఇతర సిబ్బందిని కాపాడుకోవాలంటే వారందరి సేవలను ఒకేసారి కాక, కొందరిని రిజర్వులో పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలను నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడున్న వైద్య సిబ్బంది మొత్తం ఆసుపత్రికి రోజూ వచ్చి కరోనా బాధితులకు చికిత్స చేయాల్సిన పనిలేదు. అందుకే రిజర్వుడు వైద్య దళాన్ని తయారుచేయాలని గురువారం జరిగిన వైద్యారోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి విడుదల చేశారు. 

వైద్య దళం.. ఇలా సిద్ధం
ప్రస్తుతం గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఫీవర్, సరోజిని, ఉస్మానియా, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. బోధనాస్పత్రుల్లోనూ, జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లోనూ 20 ఐసోలేషన్, 10 పడకల ఐసీయూ వార్డులను సిద్ధం చేశారు. కరోనా సేవలందించే చోట సీనియర్‌ వైద్యులను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి సహా పలుచోట్ల ఒకేసారి అందరి సేవలను వాడుకుంటున్నారు. దీనివల్ల ప్రమాదం ఏర్పడవచ్చని సర్కారు భావిస్తోంది. వైద్యులకే కరోనా సోకితే చికిత్స అందించే వారుండరు. అందుకే వైద్యులందరి సేవల్ని ఒకేసారి కాకుండా   దశల వారీగా వాడుకోవాలని భావిస్తోంది. ఈ విధానం ప్రకారం.. 

వైద్యులందరికీ ఒకేసారి డ్యూటీ వేయరు. ఒక ఆస్పత్రిలో ఉన్న సీనియర్‌ వైద్యులు, జూనియర్‌ డాక్టర్లు, నర్సులు–పారామెడికల్‌ సిబ్బంది.. ఈ మూడు కేటగిరీల నుంచి మూడు బ్యాచ్‌లు తయారుచేస్తారు. 
ఒక్కో బ్యాచ్‌ ఐదు రోజుల పాటు కోవిడ్‌ బాధితులకు సేవలందిస్తుంది. ఈ బ్యాచ్‌లోని వారికి కూడా షిఫ్టుల వారీగా విధులుంటాయి. 
ఒక బ్యాచ్‌ ఐదు రోజుల డ్యూటీ పూర్తి చేసుకున్నాక వారి స్థానంలో తదుపరి బ్యాచ్‌కు, ఆపై తరువాత బ్యాచ్‌కు విధులు అప్పగిస్తారు. 
తొలుత సేవలందించిన బృందంలో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా? ఆరోగ్య సమస్యలు తలెత్తాయా అనేది పరిశీలించి, పరీక్షలు నిర్వహిస్తారు. వైద్యులు మానసిక, పని ఒత్తిడికి గురికాకుండా చూస్తారు. 
అన్ని పరీక్షలు చేశాక మొదటి బ్యాచ్‌ వైద్య సిబ్బందిని సెలవుల్లో రిజర్వుడుగా ఉంచుతారు. ఇలా 3 దశల్లో వైద్య సిబ్బంది సేవలందిస్తారు. 

వైద్యులే ఇప్పుడు దేవుళ్లు 
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులను కాపాడుకోవాలని ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్‌ పదేపదే చెబుతున్నారు. ఇటువంటి ఆసత్కాలంలో చేతులెత్తి మొక్కినా బయటి నుంచి ఒక్క వైద్యుడినీ తీసుకురాలేమని కేసీఆర్‌ ప్రస్తావిస్తున్నారు. అందుకే ముందు వారి ఆరోగ్య పరిస్థితిపై దృష్టి పెట్టాలని ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కోవిడ్‌ చికిత్సలు అందిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇంకా చికిత్సలు ప్రారంభం కాలేదు. పైగా ప్రభుత్వ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న కొద్దిమంది డాక్టర్లను కూడా కాపాడుకోలేకపోతే ఆ తరువాత చికిత్స అందించడానికి వైద్యులుండరని సర్కారు ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చికిత్స అందిస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కోవిడ్‌ బారినపడ్డారు. చైనా, ఇటలీ, అమెరికా, స్పెయిన్‌ దేశాలలో వైద్య సిబ్బందికి కూడా కోవిడ్‌ సోకింది. అందుకే తమ ఆధ్వర్యంలో ఉన్న కొద్దిమంది వైద్యులనైనా కాపాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే రిజర్వుడు వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. 
(నా కుటుంబాన్ని కలవాలి... ఆర్థిక సహాయం చేయండి!)

మరిన్ని వార్తలు