వైద్యుల సమ్మె విరమణ

29 Jan, 2016 04:02 IST|Sakshi
వైద్యుల సమ్మె విరమణ

నేటి నుంచి యథావిధిగా ఓపీ సేవలు
రెండు రోజులుగా బోధనాసుపత్రుల్లో వైద్య సేవల బంద్
తీవ్ర ఇబ్బందులకు గురైన రోగులు


సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర వైద్యులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు చేస్తున్న ఆందోళనను గురువారం రాత్రి విరమించారు. వైద్యుల విభజన జాబితాను కమలనాథన్ కమిటీ వెల్లడించిన అనంతరం రెండురోజులుగా వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వైద్య ప్రతినిధులతో గురువారం చర్చించారు. వైద్యులు జాబితాను రద్దు చేయాలని కోరగా.. అది ప్రభుత్వ పరిధిలో లేనందున, జాబితాపై ప్రభుత్వ నిర్ణయాన్ని కమలనాథన్ కమిటీకి చెబుదామని మంత్రి హామీ ఇచ్చారు. వైద్యుల జేఏసీ ఇచ్చిన వినతిపత్రాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం తరపున వెంటనే కమలనాథన్ కమిటీకి లేఖను పంపించారు.

విభజన జాబితా ఆమోదయోగ్యంగా లేదని, జాబితాపై అభ్యంతరాలను పంపించడానికి నెలరోజుల సమయం ఇవ్వాల్సిందిగా మంత్రి కోరారు. దీనికి ప్రభుత్వ వైద్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు. తమ ఆందోళనను విరమిస్తున్నట్టుగా ప్రకటించారు.

 ప్రధాన ఆస్పత్రుల్లో స్తంభించిన సేవలు
కాగా తెలంగాణ వైద్యుల ఆందోళనలతో ఉస్మానియా, గాంధీ సహా అన్ని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో వైద్య సేవలు గురువారం పూర్తిగా స్తంభించి పోయాయి. అవుట్ పేషంట్ సేవలతో పాటు 300కి పైగా సాధారణ శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు, రోగులు, క్షతగాత్రులకు తీరని వ్యధే మిగిలింది.

ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రి, నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రి, ఈఎన్‌టీ, ఫీవర్ ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎర్రగడ్డలోని ఛాతీ, మానసిక చికిత్సాలయంతో పాటు సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూ తి ఆస్పత్రుల వైద్యులు గురువారం ఉదయం అవుట్ పేషెంట్ సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఓపీతో పాటు సాధారణ శస్త్రచికిత్సలు వాయిదా పడటంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

గాంధీలో 70 శస్త్రచికిత్సలు వాయిదా
గాంధీ వెద్యుల ఆందోళన వల్ల గురువారం ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర శస్త్రచికిత్సలు మినహా 70కిపైగా సాధారణ శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉస్మానియాలో అత్యవసర శస్త్రచికిత్సలు మినహా ఎలక్టివ్ (50-60 సాధారణ) శస్త్రచికిత్సలను నిలిపివేశారు. విషయం తెలియక ఉదయం ఐదు గంటలకే ఆయా ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు నిరాశే మిగిలింది. నీలోఫర్‌లో ఓపీ సేవలతో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు.

 ఆందోళనపథంలో డాక్టర్లు
సీమాంధ్రకు చెందిన వైద్యులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఉస్మానియా, గాంధీ సహా అన్ని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు గురువారం ఉదయం ఓపీ సేవలు బహిష్కరించి, కోఠి డీఎంఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

డాక్టర్ బొంగు రమేశ్, డాక్టర్ వీరేశం, డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ నాగేందర్, డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ నరహరి, తదితరులు మాట్లాడుతూ... రాష్ట్ర విభజనలో భాగంగా కమల్‌నాథన్ కమిటీకి విరుద్ధంగా అధికారులు ఆంధ్రాకు చెందిన వైద్యులకు తెలంగాణ రాష్ట్రంలో పోస్టింగ్‌లు ఇచ్చారని ఆరోపించారు. విభజన స్క్రూట్నీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. తమ సమక్షంలోనే తుది జాబితాను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు