బయోమెట్రిక్‌ హాజరు అమలయ్యేనా?

3 Mar, 2018 02:00 IST|Sakshi

     గత ఏడాది 25శాతం ఏర్పాటు చేస్తామన్నా అమలుకు నోచుకోలేదు

     నిధుల సమస్య, ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో నిలిపివేత

     వచ్చే జూన్‌ నుంచి అమలు చేస్తామంటున్న అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో దశల వారీగా బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ప్రవేశ పెడతామన్న విద్యాశాఖ ఆచరణలో మాత్రం చేయలేకపోతోంది. రెండేళ్ల కిందటే మొదటి విడతగా 6,391 (25 శాతం) ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినా అమలుకు నోచుకోలేదు. వాటి ఏర్పాటుకోసం మూడుసార్లు టెండర్లు పిలిచినా సదరు సంస్థలు ముందుకు రాకపోవడంతో ఆచరణలోకి తేలేకపోయామని విద్యాశాఖ చెబుతోంది. అయితే టెండర్ల సమస్యతోపాటు నిధుల సమస్యకూడా బయోమెట్రిక్‌ హాజరు విధానానికి అడ్డంకిగా మారుతుందన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనా ఈ విద్యా సంవత్సరంలో పక్కాగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నా ఎంతమేరకు చేస్తారన్నది తేలాల్సి ఉంది. 

అవసరమైన చోట వదిలేసి..
బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు విషయంలో విద్యాశాఖ తీరు పుండు ఒక చోట, మందు మరో చోట అన్న చందంగా తయారైంది. వాస్తవానికి బయోమెట్రిక్‌ హాజ రు విధానం ముందుగా ప్రవేశపెట్టాల్సింది ప్రాథమిక పాఠశాలల్లో అయినప్పటికీ, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. కానీ ప్రాథమిక పాఠశా లలకు టీచర్లు సరిగ్గా రాకపోవడం, వచ్చినా వెంటనే వెళ్లిపోవడం, ఇద్దరు ఉన్నచోట ఒక్కరే బడికి రావడం, ఒకరు ఒకవారం వస్తే, మరొ కరు ఇంకో వారం బడికి వస్తున్నట్లు విద్యా శాఖ సర్వేల్లోనే తేలింది. అలాంటి పరిస్థితుల వల్లే ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లింది. టీచర్లే బడికి సరిగ్గా రారు అన్న అపవాదును ఎదుర్కొంటోంది. అంతేకాదు ఆ పరిస్థితుల కారణంగా తల్లిదం డ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించడం లేదు. ప్రైవేటు స్కూళ్లలో చదివించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకం కలగాలంటే ముందుగా ప్రాథమిక పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాల్సి ఉంది. ఇందుకు బయోమెట్రిక్‌ హాజరు విధానం కొంత దోహదం చేస్తుంది. అందుకే ముందుగా ప్రాథమిక విద్య పటిష్టంకోసం వాటిల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయాలని విద్యాశాఖకు చెందిన అధికారులే పేర్కొంటున్నారు.

నిధుల సమస్య అధిగమించేనా?
రెండేళ్ల కిందట 6,391 ప్రాథమిక పాఠశాలల్లో బయోమెట్రిక్‌ పరికరాల ఏర్పాటుకు ఎస్‌ఎస్‌ఏ నిధులను వెచ్చించేందుకు సిద్ధమైంది. ఒక్కో పరికరానికి రూ.7 వేల అంచనాతో విద్యాశాఖ రూ.4.47 కోట్లు వెచ్చించేలా ప్రణాళికలు వేసింది. మిగతా 75 శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్‌ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు విజ్ఞప్తి చేసినా, ఆశించిన లాభం చేకూరలేదు. దీంతో నిధుల సమస్య కూడా బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలుకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో నిధులను కేటాయించి అమలు చేస్తారా? లేదా? అన్నది త్వరలోనే తేలనుంది. 

మరిన్ని వార్తలు