అటవీశాఖలో డాగ్‌ స్క్వాడ్‌! 

20 Dec, 2018 01:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుశాఖ మాదిరిగానే తెలంగాణ అటవీశాఖలోనూ డాగ్‌ స్క్వాడ్‌ను ప్రవేశపెట్టారు. అటవీ ప్రాంతాల్లో చెట్లు నరకడం, వన్యమృగాల వేట వంటి నేరాల నియంత్రణకు ఈ స్క్వాడ్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ స్క్వాడ్‌లో భాగంగా మన రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన మొదటి జర్మన్‌ షెపర్డ్‌ జాతి శునకం ‘ఛీతా’ను ముందుగా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో అటవీ పరిరక్షణ సేవలకు ఉపయోగిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లోని బీఎస్‌ఎఫ్‌ డాగ్‌ స్క్వాడ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 9 నెలలపాటు శిక్షణ పొందిన అనంతరం ఛీతా సేవలు ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. ఛీతాతో పాటు ఇద్దరు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లకు (ఎఫ్‌బీఓ) కూడా గ్వాలియర్‌లోనే 9 నెలల పాటు శిక్షణనిచ్చారు. అడవుల్లో నేరాలకు పాల్పడే వారి వాసన పసిగట్టడం ద్వారా వారి గుట్టును కనిపెట్టవచ్చని, వాటి ఆధారంగా అరెస్టులు కూడా చేయొచ్చని జన్నారం ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ కె.రవీందర్‌ సాక్షికి తెలిపారు. కవ్వాల్‌లో సంచరించే పులులు, ఇతర వన్యప్రాణులు, మృగాలు సంచరించిన స్థలాల్లో వాటి వాసనను కనిపెట్టి వాటి గమనం, సంచారం ఎటువైపు ఉందో తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. స్థానికంగా అందుబాటులో ఉన్న మేలురకం శునకాలను ఎంపిక చేసి వాటికి కూడా ఇద్దరు ఎఫ్‌బీఓల ద్వారా శిక్షణనిచ్చి డాగ్‌ స్క్వాడ్‌లను విస్తరించే ఆలోచన ప్రభుత్వానికి ఉందని రవీందర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు