శంషాబాద్‌ రెడీ..

24 May, 2020 02:58 IST|Sakshi
డిపార్చర్‌ కెమెరా వద్ద తన ఐడెంటిటీని నమోదు చేస్తున్న సిబ్బంది

రేపటి నుంచి ఎగరనున్న విమానాలు

మొదటి దశలో 30 శాతం ప్రారంభం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు పూర్తి

విమానాల్లో సీట్ల మధ్య దూరంపై మార్గదర్శకాల్లేవు

ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ వెల్లడి 

శంషాబాద్‌: సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ ప్రయాణికులతో కూడిన విమానాల రాకపోకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును అన్ని విధాలుగా సిద్ధం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో కార్గోతో పాటు వేరే దేశాల నుంచి మన వారిని తీసుకొచ్చే విమానాలు, రిలీఫ్‌ విమానాలు మాత్రమే రాకపోకలు సాగించాయి. కేంద్ర పౌర విమానయాన మార్గదర్శకాల మేరకు తొలి దశలో 30 శాతం విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించి విమానాశ్రయాన్ని సిద్ధం చేసినట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ తెలిపారు.

శనివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో మాట్లాడుతూ.. విమానం లోపల భౌతిక దూరం, నిబంధనలు ఉండేందుకు అవకాశం లేదని.. దీంతో ప్రయాణికులు స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల మధ్య దూరం ఉండేలా ఎలాంటి మార్గదర్శకాలు లేవని చెప్పారు. విమానంలో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విమానం లోపల ఆహారం సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మధుమేహ రోగులకు కొందరికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. పదేళ్లలోపు చిన్నారులు.. గర్భిణులు విమాన ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచించారు.

ఎయిర్‌పోర్టు విలేజ్‌ వద్ద భౌతిక దూరం గుర్తులు వేస్తున్న సిబ్బంది

ఎయిర్‌పోర్టులో ఇలా.. 
ఎయిర్‌పోర్టు ప్రవేశ మార్గం నుంచి భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా గుర్తులు ఏర్పాటు చేశారు. కాంటాక్ట్‌ లెస్‌ విధానంలో ప్రయాణికులు తమ పత్రాలను కెమెరా ముందు పెడితే వాటిని సంబంధిత సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు కంప్యూటర్‌లో పరిశీలించి అనుమతిస్తారు. అలాగే థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు పూర్తి చేస్తారు. ప్రయాణికులకు అందుబాటులో అన్ని ప్రాంతాల్లో శానిటైజర్లు ఏర్పాట్లు చేశారు. డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్‌ ద్వారా ప్రయాణికులను లోపలికి అనుమతిస్తారు. ప్రయాణికులకు పరిశుభ్రత.. భౌతిక దూరం నిబంధనలను అప్రమత్తం చేసేందుకు ఎయిర్‌పోర్టులో అన్ని ఏర్పాట్లు చేశారు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే చెక్‌–ఇన్‌ కియోస్క్‌లు మానిటరింగ్‌ చేయొచ్చు. కాగా, ప్రారంభంలో విమానయానం నెమ్మదించినా.. భవిష్యత్తులో ఆశాజనకంగానే ఉండొచ్చని కిశోర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 36 ప్రాంతాలకు రాకపోకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

భౌతిక దూరం కోసం ఏర్పాటు చేసిన పాద సూచికలు, ప్రయాణికులకు ఏర్పాటు చేసిన శానిటైజర్

మరిన్ని వార్తలు