ఇంట్లో శత్రువులు!

19 Feb, 2019 05:54 IST|Sakshi

సాఫ్ట్‌వేర్‌ మహిళలకూ తప్పని గృహహింస  

ఉద్యోగినుల వ్యక్తిగత జీవితంలో జోక్యం

అనుమానాలతో సాధింపులు, సూటిపోటి మాటలు  

కుటుంబ సభ్యులే వేధింపులకు గురిచేస్తున్న వైనం

ఏటా సుమారు వెయ్యికిపైగా ఫిర్యాదులు

‘ఎస్‌సీఎస్‌సీ’ తాజా అధ్యయనంలో వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: హైటెక్‌ యుగంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణిస్తున్న మహిళామణులకూ గృహహింస తప్పడంలేదు. ఐటీ రంగానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన భాగ్యనగరంలో ఏటా సుమారు వెయ్యి మంది మహిళలు ఈ తరహా హింస బారిన పడుతున్నట్లు సొసైటీ ఆఫ్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో ప్రధానంగా భర్త, అత్త, మామలు, ఆడపడుచులు ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేస్తున్న మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటూ వారిని మానసికంగా హింసిస్తున్నారని తేలింది.

ఆర్థిక, సామాజిక అంశాల్లో మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కల్పించడం, వారి స్వేచ్ఛను కట్టడి చేయడం.. చివరకు సోషల్‌ మీడియా వినియోగం విషయంలోనూ వారి పట్ల వివక్ష చూపడం, తరచూ వారి ఫోన్లు, స్నేహితులు, బంధువులతో జరిపే ఫోన్‌ చాటింగ్‌ను వారికి తెలియకుండా పరిశీలించడం, సామాజిక సంబంధాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం, సూటిపోటి మాటలు, వ్యక్తిగత జీవితంపై అనుమానంతో తరచూ వేధింపులకు గురిచేయడం.. కొన్నిసార్లు వారిపై హింసకు పాల్పడడం వంటివి చోటుచేసుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు సుమారు 220 మంది మార్గదర్శకులను రంగంలోకి దించినట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.  

కౌన్సెలింగ్‌తో నష్టనివారణ చర్యలు..
గృహహింసపై తమకు అందిన ఫిర్యాదులపై కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధులు తెలిపారు. తొలుత కౌన్సెలింగ్‌తో సరిపెడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాని పక్షంలో వారికి పోలీసుశాఖ నిర్వహిస్తున్న భరోసా కేంద్రాలకు ఇలాంటి కేసులను  బదిలీ చేస్తున్నామన్నారు. మహానగరం పరిధిలో సుమారు వెయ్యి వరకు ఐటీ, బీపీఓ సంస్థలున్నాయి. వీటిలో పనిచేసేవారిలో సుమారు మూడు లక్షలమంది వరకు మహిళలున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. గతేడాది సుమారు వెయ్యి మంది ఇలాంటి గృహహింసను తాళలేక తమను సంప్రదించినట్లు తెలిపారు. వారి వ్యక్తి గత జీవితానికి ఇబ్బంది కలగని రీతిలో తమను సంప్రదించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నామన్నారు. తమ కౌన్సెలింగ్‌తో సుమారు 30 శాతం మందిలో మార్పు కనిపించిందని తెలిపారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు వెల్లడించారు.

కుటుంబ సభ్యుల సహకారమే కీలకం..
ఐటీ, బీపీఓ తదితర రంగాల్లో పనిచేస్తున్న మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గడువులోగా ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న ఒత్తిడితో పనిచేస్తుంటారు. వీరి పనివేళల్లోనూ అనూహ్య మార్పులుంటాయి. ఒకవైపు ఇంటి పని.. మరోవైపు ఆఫీస్‌ ఒత్తిడితో చిత్తవుతున్న మహిళలకు కుటుంబ సభ్యుల సహకారమే కీలకమని సైకాలజిస్టులు స్పష్టంచేస్తున్నారు. వారికి మానసిక సాంత్వన కల్పించడం, వారి రోజువారీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను అధిగమించేందుకు వారికి భరోసా, నైతిక మద్దతునిచ్చేందుకు ఇతోధికంగా సహకరించాలని సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు