60మంది ఆర్టీసీ కార్మికులకు చేయూత

13 Nov, 2019 11:03 IST|Sakshi
కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేస్తున్న దాతలు

నిత్యావసర సరుకులు అందజేసిన దాతలు

అక్కున చేర్చుకున్నారంటూ కార్మికుల కన్నీటి పర్యంతం

39వ రోజు కొనసాగిన సమ్మె.. 

సాక్షి, నల్లగొండ: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు పలువురు చేయూతనందించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యాలయంలో 60మంది పేద ఆర్టీసీ కార్మికులకు 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందజేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఒకరు, తెలంగాణ విద్యావంతుల వేదిక, డీటీఎఫ్‌ నాయకులు, రిటైర్డ్‌ అధ్యాపకులు ఈ సరుకులను విరాళంగా అందజేశారు. పిల్లల చదువు, ఇంటి అద్దె,కుటుంబం గడవడం కష్టంగా ఉన్న తరుణంలో ఆదుకున్నారని పలువురు కార్మికులు కంటతడి పెట్టారు. సీఎం కనుకరించకపోయినా మంచి మనసున్నవారిగా కార్మికుల పట్ల కరుణ చూపడం తమకు ఎంతో బలాన్ని ఇచ్చిందన్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సీ ఎం కేసీఆర్‌ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్లుగా ఉందని, న్యాయస్థానాలు సూ చించినా మార్పు రాకపోవడం.. ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోగా, 48వేల మంది కార్మికులను రోడ్డు పాలు చేశారని, ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారని, ఓట్లు వేసిన ప్రజలంతా తప్పుచేశామన్న ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, రిటైర్డ్‌ అధ్యాపకుల సంఘం నాయకులు ఆర్‌. విజయ్‌కుమార్, నర్సిరెడ్డి, వెంకులు, ఏడుకొండలు, మునాస వెంకన్న, హరికృష్ణ, బకరం శ్రీనివాస్, కొండేటి మురళి, దయాకర్, ఈఎస్‌ రెడ్డి, రామలింగం, రాజు, వెంకన్న పాల్గొన్నారు. 

కార్మికుల నిరసన
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు వామపక్ష ప్రజా సంఘాలతో కలిసి స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  అనంతరం వంటావార్పు నిర్వహించారు. 

విధుల్లో చేరిన కార్మికుల ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ..
మిర్యాలగూడ డిపోలో ఇద్దరు కార్మికులు విధుల్లో చేరారు. వీరి తీరును నిరసిస్తూ కార్మికుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చెప్పులతో కొడుతూ ర్యాలీ నిర్వహించారు. ఇంతమంది కార్మికులు రోడ్డున పడితే ఇద్దరు విధుల్లోకి చేరి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు