నిర్లక్ష్యాన్ని సహించం

17 Nov, 2014 01:58 IST|Sakshi
నిర్లక్ష్యాన్ని సహించం

ఖమ్మం జెడ్పీసెంటర్: పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. అధికారులు మొక్కుబడిగా సమావేశాలకు హాజరుకాకుండా యథార్థ నివేదికలతో రావాలని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ హోదాలో సమావేశానికి హాజరైన ఎంపీ కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం చైర్మన్, ఎంపీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలి విజిలెన్స్ కమిటీ సమావేశం సంతృప్తికరంగా లేదన్నారు.

మొక్కుబడి నివేదికలతో అధికారులు హాజరుకావటం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు..దానికి అధికారులు సహకరించాలని కోరారు. ప్రతి మూడునెలల కోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఒకటి, రెండు పేజీల నివేదికలతో కాకుండా సమగ్ర సమాచారంతో రావాలన్నారు. తదుపరి సమావేశంలో పూర్తిస్థాయి సమీక్ష చేస్తామన్నారు. రెండునెలలకోసారి క్షేత్రపర్యటన చేసి అభివృద్ధిని పర్యవేక్షిస్తామన్నారు. ఒకటి, రెండుసార్లు మాత్రమే హెచ్చరిస్తాం..మూడోసారి సంబంధిత శాఖలకు సిఫారసు చేసి చర్యలు చేపడతామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి అభివృద్ధికి పాటుపడాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ మీదే ఎక్కువసేపు చర్చ జరిగిందన్నారు.

సమీక్ష తీరు ఇలా..
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. తొలుత కలెక్టర్ కమిటీ సమావేశం నిర్వహణ తీరును వివరించారు. అనంతరం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని తనకు ఎజెండా కాపీ అందలేదన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉంటే అక్కడికి పంపించేవారని, ఇప్పుడలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సమాచార పుస్తకం పంపామని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు..కాబట్టి వారికి ఏజెండా కాపీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఎంపీ పొంగులేటి సూచించారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను సంబంధిత అధికారులు వివరించారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద 1.77 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం లక్ష్యంకాగా 50వేల వరకు నిర్మించామన్నారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారుల లోపం ఉందని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆరోపించారు. మరుగుదొడ్ల నిర్మా ణ వ్యయాన్ని రూ.10,900 నుంచి రూ.20వేలకు పెంచేలా తీర్మానం చేసి, ప్రతిపాదనలు పంపాలని ఎంపీ పొంగులేటి సూచించారు.
 ఉపాధి హామీ పనుల నిబంధనలు ఎలా ఉన్నాయి, గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానం చేస్తున్నారా? అని ఎంపీ ప్రశ్నించారు.

లేబర్ బడ్జెట్ ఏర్పాటు చేసి వంద రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పీడీ వివరించారు. ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్‌లు దీనిలో పరిమితికి మించి జోక్యం చేసుకుంటున్నారని కలెక్టర్ అన్నారు. వీరిని తొలగించి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఉపాధిహామీలో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, చండ్రుగొండ, కల్లూరులో అవినీతి జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, అక్రమాలకు పాల్పడిన వారిని తొలగించాలని కోరారు. చండ్రుగొండ మండలం రావికంపాడులో వందశాతం మరుగుదొడ్లు నిర్మించినట్లు నివేదికలు ఇచ్చారు.

ఆ ఊరికి బహుమతి కూడా అందజేశారు. కానీ అక్కడ ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించలేదు..దీనిపై విచారణ చేపట్టాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వేంసూరులో కోటి రూపాయల స్కాం జరిగిందని ఎంపీడీవోను సస్పెండ్ చేశారు. నగదు రికవరీ అయిందా? లేదా? అని ఎమ్మెల్యే పాయం ప్రశ్నించారు. ఇందిర జలప్రభ పనులు పదిశాతం కూడా పూర్తికాలేదన్నారు. శాఖల మధ్య సమన్వయం లేదు. ట్రాన్స్‌కో అధికారులు ఎక్కడ అని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ప్రశ్నించారు. ఎంపీలు సమావేశానికి వస్తే ఎస్‌ఈ స్థాయి అధికారి సమావేశానికి రాలేడా? అన్ని ప్రశ్నించారు.

నీటిపారుదలశాఖ మొత్తం 300 పథకాలు నిర్వహిస్తుంటే వాటిలో 200 మూలకుపడ్డాయంటే ఆ శాఖ పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని ఎంపీ పొంగులేటి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలేరుపాడు మండలంలో ఇందిరమ్మ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఎవరు ఇస్తారని ఎమ్మెల్యే తాటి ప్రశ్నించారు. ఆ బిల్లులను చంద్రబాబు ఇస్తారని ఎంపీ నాయక్ సమాధానం ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లించేలా తీర్మానం చేస్తున్నట్లు పొంగులేటి ప్రకటించారు. చివరిలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట వెంకటేశ్వరరావు మృతికి సమావేశం మౌనం పాటించింది.

శాసన సభ్యుల డుమ్మా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలో మొదటి సారిగా జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి సత్తుపల్లి, పాలేరు, మధిర, ఖమ్మం, భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం శాసన సభ్యులు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అమలవుతున్న తీరుపై నిర్వహించిన సమావేశానికి వారు హాజరుకాకపోవడం విమర్శలకు తావిచ్చింది.

మరిన్ని వార్తలు