అనుమతి లేనిదే ప్రణయ్‌ విగ్రహం వద్దు

29 Sep, 2018 09:28 IST|Sakshi

ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటు పనులు ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు

సాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలో పెరుమాళ్ల ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని, అప్పటి వరకు ఎలాంటి పనులను చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి కోరిక మేరకు అతడి విగ్రహాన్ని మిర్యాలగూడలోని సాగర్‌ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్‌ విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌పై హైకోర్టు జస్టిస్‌ ఏవీ. శేషసాయి పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు. 

అదేవిధంగా ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటులో కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్‌ సీఐ, మున్సిపల్‌ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. కాగా టూటౌన్‌ సీఐ ప్రణయ్‌ తండ్రికి నోటీస్‌లు ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన అధికారులు వచ్చే నెల 23వ తేదీన కోర్టుకు హాజరుకావాలని కోరింది.

మారుతీరావు ఇల్లు, కార్యాలయంలో సోదాలు
ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఇల్లు, కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. మిర్యాలగూడ లోని మారుతీరావు కార్యాలయం, నాగార్జుననగర్‌లో ఉన్న సొంతింటిలో సోదాలు నిర్వహించారు. పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అధికారుల అండతో కోట్లాది రూపాయలు సంపాదించినట్లు వస్తున్న ఆరోపణలను నివృత్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. సుపారీ గ్యాంగ్‌ కు ఇచ్చిన కోటి రూపాయలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా డీఎస్పీ పి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మారుతీరావుకు సంబంధించిన రెండు చోట్ల సోదాలు చేశారు. మారుతీరావు రాయించుకున్న ఒక వీలునామాతో పాటు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచా రం. సోదాల్లో లభించిన పత్రాలను సమగ్రంగా పరిశీలించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ సోదాల్లో సీఐ లు ధనుంజయ్, శ్రీనివాస్‌రెడ్డి, సదానాగరాజు, వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

పోలీస్‌ కస్టడీలో ప్రణయ్‌ హత్యకేసు నిందితులు
ప్రణయ్‌ హత్య కేసులోని ఏడుగురు నిందితులను శుక్రవారం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసులోని నిందితులు మారుతీరావు, అస్గర్‌అలీ, బిహార్‌శర్మ, అబ్దుల్‌ బారి, శ్రవణ్, కరీం, శివలను విచారిస్తున్నారు. ప్రణయ్‌ని కిడ్నాప్‌ చేసేందుకు వచ్చిన సభ్యులు ఎవరు? రెక్కీ ఎన్నిసార్లు నిర్వహించారు? హత్యకు డీల్‌ ఎవరికి ఎంత? తదితర విషయాలను రా బట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులు పాటు పోలీస్‌ కార్యాలయంలో విచారించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు