ఉద్యమాన్ని యువత మర్చిపోవద్దు

20 Jun, 2014 04:12 IST|Sakshi
ఉద్యమాన్ని యువత మర్చిపోవద్దు

మహబూబాబాద్ : తెలంగాణ కోసం మొదటి నుంచి మద్దతు ఇచ్చాను.. నేటికీ మద్దతు ఇస్తూనే ఉన్నాను.. తెలంగాణ ఉద్యమాన్ని యువత మర్చి పోవద్దని సినీ హీరో సుమన్ అన్నారు. త్యాగాల వీణ.. జయహో తెలంగాణ చిత్రానికి సంబంధించిన ఓ సన్నివేశాన్ని గురువారం సాయంత్రం మానుకోట పట్టణంలోని నెహ్రూ సెంటర్‌లో చిత్రీకరించారు. అనంతరం ఆర్.సి.లాడ్జ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు మద్దతు ఇస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురైనా.. అనవసరంగా ఇబ్బందులు పడతామని పలువురు వాదించినా పట్టించుకోలేదు.

 ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవించి ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించుకోగలిగామని చెప్పారు. ఈ పోరాటంలో ఎంతో మంది త్యాగాలు చేశారు. ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఉద్యమంలో జరిగిన ఈ సన్నివేశాలను ప్రజలకు జీవితాంతం గుర్తుండాలనే ఉద్ధేశంతోనే ఈ సినిమాను రూపొందింస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని యువత మర్చిపోవద్దని సూచించారు. తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందాలని, ప్రజలు అంతా సంతోషంగా ఉండాలని బంగారు తెలంగాణగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా తాగు, సాగు నీరు రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

ఈ సినిమాలో తాను టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాలివుడ్ సినిమాలపై దృష్టి పెట్టానని, 36 సంవత్సరాలు సినిరంగంలో ఉండి 350 సినిమాల్లో నటించినట్లు వివరించారు. రాజకీయ పార్టీలలో చాలా మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా పేదరికం పోవాలని, మహిళలకు రక్షణ ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, భవిష్యత్‌లో చెప్పలేమనని వివరించారు.

 తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్య్ర సంగ్రామం : దర్శకుడు మిర్యాల రవికుమార్
తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్య్ర సంగ్రామం అని దర్శకుడు మిర్యాల రవికుమార్ అన్నారు. సీమాంధ్రలో ఎంత చిన్న విషయం జరిగినా దాన్ని సినిమాలలో చిత్రీకరించి పెద్దగా చూపిస్తారని, తెలంగాణలో ఎంత పెద్ద విషయం జరిగినా సినిమాల్లో చూపించేవారు కాదని చెప్పారు. గతంలో చాకలి ఐలమ్మ సినిమాకు దర్శకత్వం వహించానని, నేడు త్యాగాల వీణ.. జయహో తెలంగాణ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని అన్నారు. మరో నెల రోజుల్లో సినిమా పూర్తవుతుందని, శుక్రవారం కూడా మానుకోటలోని గాయత్రి దేవాలయంలో సినిమా చిత్రీకరణ ఉంటుందని తెలిపారు.
 
తెలంగాణ ప్రజల కల సాకారమైంది : జేఏసీ డివిజన్ కన్వీనర్ డోలి సత్యనారాయణ
రాష్ట్ర ఏర్పాటుతో 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల సాకారమైందని జేఏసీ డివిజన్ కన్వీనర్ డోలి సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. అమరవీరుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే రాష్ట్రం సిద్ధించిందన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు పిల్లి సుధాకర్, సాయి, కాంగ్రెస్ నాయకుడు కైరంకొండ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగ్‌ను తిలకించడానికి జనం భారీ ఎత్తున తరలివచ్చారు. హీరో సుమన్‌తో కరచాలనం చేయడానికి అభిమానులు పోటీ పడ్డారు.

మరిన్ని వార్తలు