ఎక్కడికక్కడే అరెస్టులు!

13 Mar, 2020 04:51 IST|Sakshi

సెలవులు ఇవ్వొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ

యథాతథంగా ఛలో అసెంబ్లీ : ఐక్య వేదిక  

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచే నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు గురువారం పాఠశాలలకు వెళ్లి మరీ ఉపాధ్యాయ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను పెద్ద సంఖ్యలో ముందస్తు అరెస్టులు చేశారు. టీచర్లకు సెలవులు ఇవ్వవద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇచ్చిన సెలవులను రద్దు చేయడం ప్రారంభించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు (సమ్మెటివ్‌ అసెస్మెంట్‌ – ఎస్‌ఏ 2) పరీక్షలు, ఈనెల 19వ తేదీ నుంచి టెన్త్‌ పరీక్షలు ఉన్న నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తీవ్ర అనారోగ్యం వంటి అత్యవసర సమయాల్లో తప్ప టీచర్లకు సెలవులు ఇవ్వొద్దని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ చిత్రా రామచంద్రన్‌ ఆదేశాలు జారీ చేశారు.  మరోవైపు తమ చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని ఐక్యవేదిక స్పష్టం చేసింది. వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలను మహిళలతో సహా అరెస్టు చేయడాన్ని ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది.

మరిన్ని వార్తలు