ఎన్నికల నిలుపుదల సాధ్యం కాదు

23 May, 2019 02:35 IST|Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికలపై హైకోర్టు

ఓటర్ల తుది జాబితాను వెంటనే ప్రచురించండి

ఎన్నికల సంఘానికి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల కోటా కింద జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సం బంధించి ఓటర్ల తుది జాబితాను వెంటనే ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తుది ఓటర్ల జాబితా ను ప్రచురించకుండానే రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల సంఘం ఈ నెల 6న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఈ మూడు జిల్లాలకు చెందిన కె.లింగుస్వామి, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్‌ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాద నలు వినిపిస్తూ.. తుది ఓటర్ల జాబి తాను ప్రచురించకుండా, ఎన్నికలను నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.  తరువాత ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఒకసారి నోటిఫికేషన్‌ జారీ అయిన తరువాత ఎన్నికల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయంలో న్యాయస్థానాలకు పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఓటర్ల జాబితా సిద్ధంగా ఉందని ఎన్నికల సంఘం చెబుతున్న నేపథ్యంలో, ఎన్నికలను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంది. వెంటనే ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ జాబితాను వెబ్‌సైట్‌లో కూడా ఉంచాలని హైకోర్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు