‘ఆసరా’ పంపిణీలో ఆలస్యం జరగొద్దు!

15 Apr, 2016 03:49 IST|Sakshi
‘ఆసరా’ పంపిణీలో ఆలస్యం జరగొద్దు!

పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో మంత్రి కేటీఆర్
నిధుల విషయంపై ఆర్థిక శాఖతో మాట్లాడతా..

 సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరగకుండా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పథకాల అమలుపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్) విభాగాల ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. ఆర్థిక శాఖ నుంచి నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని పంచాయతీరాజ్ డెరైక్టర్ అనితా రామచంద్రన్ మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ఆర్థిక శాఖ నుంచి ‘ఆసరా’ పింఛన్లకు సకాలంలో నిధులు విడుదలయ్యేలా ఆ శాఖ ఉన్నతాధికారులతో తానే స్వయంగా మాట్లాడతానన్నారు. అలాగే, ఎండ తీవ్రత పెరిగినందున ఉపాధిహామీ పనులకు హాజరవుతున్న కూలీల ఆరోగ్యం దెబ్బతినకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

 19న కేంద్రమంత్రి పర ్యటన
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్ చౌదరి ఈనెల 19న రాష్ట్రంలో పర్యటించనున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు. ఖమ్మం-పాలేరు సెగ్మెంట్‌తో పాటు మెదక్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను కూడా కేంద్ర మంత్రి పరిశీలిస్తారని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు.

మరిన్ని వార్తలు