వికలాంగులను విస్మరించడం తగదు

19 Feb, 2016 03:41 IST|Sakshi

హైదరాబాద్: వికలాంగ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం మూడురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడం తగదని బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్న వికలాంగ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా వికలాంగులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

వికలాంగుల డిమాండ్లు న్యాయమైనవని, ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రేపటి కల్లా ఈ సమస్యపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే పదివేల మంది వికలాంగ విద్యార్థులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామన్నారు.  భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్‌లు కృష్ణయ్యతో కలసి వికలాంగుల నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ నిరసనలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అందె రాంబాబు, చెరుకు నాగభూషణం, నారా నాగేశ్వరరావు, పద్మప్రియ, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు