మేమే రాజీనామా చేయాలి

30 May, 2019 02:38 IST|Sakshi

రాహుల్‌ గాంధీ కాదు..

ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ కోదండరెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సింది రాహుల్‌ గాంధీ కాదని, ఆయా రాష్ట్రాల నాయకత్వాలుగా ఉన్న తామేనని ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని నడిపించడంలో రాహుల్‌కు స్పష్టమైన అవగాహన ఉందని, 2019 ఎన్నికల్లో ఆయన పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రచారం నిర్వహించారన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమిని రాహుల్‌కు ఆపాదించడం సరైంది కాదని అన్నారు. ఆయన రాజీనామా చేయాల్సిన పనిలేదని, దీనికి ఆయా రాష్ట్రాల నాయకత్వాలే బాధ్యత తీసుకుని రాజీనామాలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.  

రాహుల్‌ కొనసాగాలి: రంగారెడ్డి, మల్లు రవి
రాహుల్‌ నిర్ణయం సరైంది కాదని, ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఉండటాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని బుధవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్‌ తప్ప ఎవరు అధ్యక్షుడైనా.. పార్టీ పటిష్టం కాలేదని, ఆయనే కొనసాగాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఓ ప్రకటనలో కోరారు.  

వితండవాదం మానుకోండి: కోదండరెడ్డి
నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పరాజయం గురించి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన వితండవాదాన్ని మానుకోవాలని కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన టీపీసీసీ కిసాన్‌సెల్‌ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఎన్‌ఎస్‌యూఐ ప్లకార్డుల ప్రదర్శన
రాహుల్‌ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) ఆధ్వర్యంలో గాంధీభవన్‌ వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్‌ తన పదవిలో కొనసాగాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు