చరిత్ర ఆనవాళ్లను చెరిపేయొద్దు

16 Mar, 2017 03:50 IST|Sakshi
చరిత్ర ఆనవాళ్లను చెరిపేయొద్దు

నంగునూరు: తవ్వకాల సందర్భంగా గ్రామాలలో బయటపడుతున్న చారిత్రక ఆనవాళ్లను కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పురావస్తు శాఖ సంచాలకులు విశాలాక్షి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో రెండో విడత తవ్వకాలను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమాకులలోని రక్కిసరాళ్ల ప్రాంతంలో ఆది మానవుల అవశేషాలు ఉన్నాయన్నారు.

సుమారు 3,500 సంవత్సరాల కిందట ఇక్కడ మానవులు జీవించారని, సిస్ట్‌ బరియల్‌ సమాధులను నిర్మించారని చెప్పారు. ఆదిమానవులు ఎక్కడి నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారో శాస్త్రీయంగా పరిశోధిస్తామన్నారు. పుల్లూర్‌లో జరిపిన తవ్వకాల్లో 2,500 యేండ్ల నాటి సమాధులుగా తేల్చామని, నర్మెట, పాలమాకులలో లభించే వస్తువులపై డీఎన్‌ఏ పరీక్షలు చేసి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు.

తెగిన క్రేన్‌ వైర్లు
తవ్వకాల్లో భాగంగా బయటపడ్డ అతి పెద్ద రాతి సమాధిని తెరిచేందుకు రెండు క్రేన్లతో ప్రయత్నించగా.. ఓ క్రేన్‌ తీగలు తెగి గాలిలోకి లేచింది. రాతిబండ చాలా బరువు ఉందని, హైదరాబాద్‌ నుంచి రెండు భారీ క్రేన్లను తెప్పించి కప్పులను తొలగిస్తామని విశాలక్షి తెలిపారు. ఆమె వెంట పురావస్తుశాఖ ఉప సంచాలకులు రాములునాయక్, సహాయ సంచాలకులు పద్మనాభం, జెడ్పీవైస్‌ చైర్మన్‌ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, పురావస్తుశాక సహాయ సంచాలకులు నాగరాజు, ప్రాచీన కట్టడాల సంరక్షకుడు భానుమూర్తి, స్థానిక నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు