మీడియా స్వేచ్ఛను హరించొద్దు

23 Sep, 2014 01:00 IST|Sakshi
మీడియా స్వేచ్ఛను హరించొద్దు

ఆ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలి
అఖిలపక్ష సదస్సు డిమాండ్

 
హైదరాబాద్: మీడియా స్వేచ్ఛను హరించటం సరికాదని, ఏబీఎన్, టీవీ9 చానళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ ఏబీఎన్, టీవీ9 ఆధ్వర్యంలో ‘మీడియా స్వేచ్ఛ పరిరక్షణ’పై అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. విశాలాంధ్ర సంపాదకులు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, సీపీఎం తెలంగాణ అధ్యక్షుడు త మ్మినేని వీరభద్రం, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్, నాగం జనార్దన్ రెడ్డి (బీజేపీ), రేవంత్‌రెడ్డి (టీడీపీ), విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, సినీనటుడు శివాజీ తదితరులు ప్రసంగించారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, ఆ రెండు చానళ్ల నిషేధం ఎమ్మెస్‌ఓలకు సంబంధిం చిన అంశమని, తమకెలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. సీపీఐ నేత కె.నారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే 10 కిలోమీటర్ల లోతు బొందపెడతామని కాళోజీ సొంత జిల్లా వరంగల్‌లోనే అనటం బాధాకరమని, ఒకవేళ కాళోజీ బతికుంటే ఆ మాటలను ఏ మాత్రం సహించి ఉండేవారు కాదన్నారు. పత్రికలకు స్వేచ్ఛ ఇవ్వకుంటే అభివృద్ది సాధ్యం కాదని తమ్మినేని వీరభద్రం చెప్పారు.

ఇది ఎమ్మెస్‌ఓల ముసుగులో మీడియాపై విధించిన నిషేధమని కె.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష ధోరణితో నియంతలా వ్యవహరిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, మాజీ ఎమ్మెల్యేలు  శశిధర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, సీపీఐఎంఎల్ నాయకులు గోవర్ధన్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, విమలక్క, పౌరహక్కుల సంఘం నేత రఘు, పీడీఎస్‌యూ అధ్యక్షుడు గౌతం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్‌కు వినతిపత్రం

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలపై నిషేధాన్ని ఎత్తివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వివిధ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు గవర్నర్‌ను కోరారు. అఖిలపక్ష సదస్సులో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేశారు.  
 
ముక్తకంఠంతో వ్యతికించాలి: అమర్

 ఏ ఒక్క చానల్, పత్రికపై దాడి జరిగినప్పుడైనా మిగతా  పత్రికలు, చానళ్లు ముక్తకంఠంతో ఎదిరించి ఉంటే ఇప్పుడిలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్ అన్నారు. తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో  అక్కడి ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రిక, సాక్షి చానల్‌ను అధికారిక కార్యక్రమాలకు అడ్డుకుంటోందని అన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని అన్ని పత్రికలు, చానళ్లు ముక్తకంఠంతో ఎదిరించాలని కోరారు. సమాజంలో తమను ఎదిరించే వారుండకూడదని ప్రభుత్వాలు భావించడం సరి కాదన్నారు. ప్రసారాల నిలిపివేత ఎమ్మెస్‌వోల అంశమనడం విడ్డూరమన్నారు.
 

>
మరిన్ని వార్తలు