వదంతులను నమ్మొద్దు

28 Feb, 2020 08:22 IST|Sakshi
స్థానిక చిరువ్యాపారులతో కలిసి టీ తాగుతున్న సీపీ

సోషల్‌ మీడియాలో వచ్చేవన్నీ నిజాలు కావు...

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి...

పాతబస్తీలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పర్యటన

చార్మినార్‌: ఎక్కడో జరుగుతున్న సంఘటనలపై నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన  అవసరం లేదని, హైదరాబాద్‌ సిటీ పూర్తి ప్రశాంతంగా ఉందని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. బుధవారం రాత్రి ఆయన చార్మినార్‌ ఏసీపీ అంజయ్యతో కలిసి పాతబస్తీలోని చార్మినార్‌–మక్కా మసీదు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆయన చార్మినార్‌ నుంచి మక్కా మసీదు వరకు కాలినడకన తిరుగుతూ స్థానిక చిరువ్యాపారులతో ముచ్చటించారు. వారితో కలిసి టీ తాగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వాట్సాప్‌ గ్రూప్‌ల్లో వచ్చే పోస్టింగ్‌లను చూస్తారా...? అంటూ   చిరువ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో వచ్చే పోసింగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పుకార్లను నమ్మవద్దన్నారు. కొందరు ఉద్దేశపూర్యకంగా కాపీ పేస్ట్‌ పద్దతిలో వాట్స్‌ప్‌లో అభ్యంతరకరమైన పోసింగ్‌లు పెడుతున్నారన్నారు. రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్‌లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాం కాలం నుంచి పాతబస్తీలో అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలసి సహజీవనం చేస్తున్నారన్నారు. చిరువ్యాపారులు పాతబస్తీలోని చార్మినార్, మక్కా మసీదు తదితర ప్రాంతాల్లో ప్రశాంతంగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారన్నారు. అయితే సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు ఆందోళనకు గురిచేసే అవకాశాలున్నాయన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చేవన్నీ నిజాలు కావని, ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్థానికుల సహకారం అవసరమన్నారు. ఈ నేపథ్యంలో తాను చార్మినార్‌ ఏసీపీ అంజయ్యతో కలిసి రాత్రి వేళల్లో పాతబస్తీలో ఆకస్మికంగా పర్యటించి స్థానిక వ్యాపారులు, ప్రజల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఏదైనా అవసరమైతే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. 

మరిన్ని వార్తలు