మందుల డోర్ డెలివరీ..!

2 Jul, 2015 01:28 IST|Sakshi
మందుల డోర్ డెలివరీ..!

సాక్షి, హైదరాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు) మొదలుకుని బోధనాసుపత్రుల వరకూ మందుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టనుంది. ఇకపై పోస్ట్ ఆఫీసుల ద్వారా వీటికి మందులను డోర్ డెలివరీ చేయనుంది. ఈ మేరకు పోస్టల్ విభాగంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తపాలా విభాగం ప్రతి జిల్లాకు మందులు సరఫరా చేసేందుకు ఓ రవాణా వాహనాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ప్రతి ఆస్పత్రికీ నెలలో ఒకటి లేదా రెండుసార్లు ఆ వాహనం వెళ్లి.. ఉన్నతాధికారులిచ్చిన ఇండెంట్ ప్రకారం మందులను అందజేస్తుంది.

వెంటనే సంబంధిత ఆస్పత్రి అధికారితో మందులు చేరినట్టుగా సంతకం తీసుకుంటుంది. ప్రతీ జిల్లాకు మందులను సరఫరా చేసినందుకు పోస్టల్ విభాగానికి తెలంగాణ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) నెలకు రూ.లక్ష చెల్లిస్తుంది. అంటే రాష్ట్రం లో మందుల సరఫరా చేసినందుకు నెలకు రూ.10 లక్షలు చెల్లిస్తారు. ఆ ప్రకారం ఏడాదికి రూ.1.20 కోట్లతో ప్రతి ఆస్పత్రికీ పోస్టల్ విభాగం మందులను డోర్ డెలివరీ చేస్తుంది.

 పడిగాపులు నివారించేందుకే..
 రాష్ట్రంలో 700 వరకూ పీహెచ్‌సీలు.. 130 వరకూ ఏరియా ఆస్పత్రులు.. పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ).. 15 బోధనాసుపత్రులు ఉన్నాయి. ఇన్ని ఆస్పత్రులకు మందుల సరఫరా ఒక యజ్ఞంలా సాగేది. అయితే ఏ సరఫరాదారుడు ఏ మందును ఎప్పుడు సరఫరా చేస్తాడో తెలియని పరిస్థితి. మందులను కంపెనీల నుంచి సకాలంలో కొనుగోలు చేసినా సరైన రవాణా విధానం లేకపోవడంతో ఆస్పత్రుల్లో పరిస్థితి ఘోరంగా ఉండేది.

టెండర్ నిబంధనల ప్రకారం 60 రోజుల్లోగా సరఫరాదారుడు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ పరిధిలో ఉన్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు మందులు సరఫరా చేయాలి. కానీ అలా జరగడం లేదు. ప్రతీ పీహెచ్‌సీ లేదా సీహెచ్‌సీకీ చెందిన ఫార్మసిస్ట్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌కు వెళ్లి, అద్దెకు వాహనం తీసుకుని మందులు తెచ్చేవారు. మందులు తేవడంలో జాప్యమైతే రోగుల్ని వెనక్కి పంపేవారు. తాజానిర్ణయంతో మందుల రవాణాలో జాప్యం ఉండదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా