‘డిగ్రీ’ కాలేజీ మార్పునకు మరో చాన్స్‌!

23 Jun, 2018 04:18 IST|Sakshi

ప్రవేశాల కమిటీ దోస్త్‌ చర్యలు

కాలేజీల్లో చేరిన వారికి మూడో దశలో అవకాశం

హెల్ప్‌లైన్‌ కేంద్రాల ద్వారా పరిష్కారానికి ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌ : డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) కమిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కాలేజీల్లో చేరిన, మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు మరోసారి ఆప్షన్లకు అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన 74 హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో విజ్ఞాపనలు స్వీకరించనున్నట్లు సమాచారం. కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తమ తల్లిదండ్రుల నుంచి వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ తీసుకొని తమ కాలేజీల్లో సీట్లు వచ్చేలా ఆప్షన్లు ఇచ్చారని, ఫలితంగా ఇష్టం లేని కాలేజీల్లో సీట్లొచ్చాయని దాదా పు 2 వేల మంది విద్యార్థులు ఇటీవల హైదరాబాద్‌ లోని దోస్త్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

దీంతో వారికి రెండో దశలో ఆప్షన్లకు అవకాశమిచ్చిన దోస్త్‌.. వారితోపాటు అన్ని జిల్లాల విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని జిల్లాల్లో హెల్ప్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సమస్య పరిష్కారం కాకపోతే హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ సహకారంతో విజ్ఞప్తుల కాపీని స్కాన్‌ చేయించి హైదరాబాద్‌ కళాశాల విద్యా కమిషనర్‌ కార్యాలయంలోని సూపర్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రానికి పంపితే సమస్య పరిష్కరించి మూడో దశలో ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టనున్నారు.
 
84 వేల మందికీ అవకాశం 
మొదటి దశ ప్రవేశాలల్లో సీట్లు పొందిన 84 వేల మంది విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పించాలని దోస్త్‌ నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థులు ఇచ్చిన మొదటి ఆప్షన్‌ ప్రకారమే వారికి సీట్లు లభించినందున రెండో దశ కౌన్సెలింగ్‌లో వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొదటి దశలో సీట్లు వచ్చిన వారు కూడా కాలేజీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఇందుకు దోస్త్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్న హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో విజ్ఞప్తి చేసేలా చర్యలు చేపట్టింది.

మరిన్ని వార్తలు