‘దోస్త్‌’ కుదరలేదు

14 Jun, 2018 11:13 IST|Sakshi

డిగ్రీలో ప్రవేశాలకు  మొదటి దశ సీట్ల కేటాయింపు పూర్

ఇంకా రిపోర్టు చేయని  పలువురు..

ప్రభుత్వ కళాశాలల్లో సీటు వచ్చినా ఫీజుచెల్లించాలనడంతో వెనుకడుగు

అవగాహన లేకపోవడంతో నష్టపోతున్న విద్యార్థులు

ఫీజులు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద బారులు


ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థులు జిల్లాకేంద్రంలోని ఎన్‌టీఆర్, ఎంవీఎస్‌ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందారు. ‘దోస్ట్‌’ ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో సీటు వచ్చిన తర్వాత చేరాలంటే ఖచ్చితంగా ఫీజు చెల్లించాలని కళాశాలల అధికారులు చెప్పడంతో ఇలా బ్యాంకు ముందు బారులు తీరారు. ప్రవేశం పొందేందుకు బుధవారం ఆఖరి తేదీ కావడంతో పెద్దసంఖ్యలో విద్యార్థులు రావడంతో బ్యాంకు అధికారులు బయట నిలబెట్టి ఒక్కొక్కరిని లోపలకు పంపించారు.


సాక్షి, మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌ : ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ) కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రవేశాల సమయంలో ఇచ్చిన సమాచారం.. ఇప్పుడు చెబుతున్న మాటలకుపొంతన లేకుండా పోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదేకాకుండా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్న అపోహపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులను కలవరానికి గురి చేస్తోంది. ఫలితంగా తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తయినా ఇంకా పలువురు విద్యా ర్థులు రిపోర్ట్‌ చేయకపోగా.. ప్రభుత్వ కళాశాలలో చేరేం దుకు ఫీజు చెల్లించాలన్న ప్రచారంతో బ్యాంకుల వద్ద బారులు తీరి కనిపిస్తుండడం గమనార్హం.


మొత్తం 90 కళాశాలలు
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 90 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటల్లో కలిపి 34,555 సీట్లు ఉండగా, మొదటి దశ కింద ‘దోస్త్‌’ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 8,128 మందికి సీట్లు కేటాయించారు. అయితే, ఇందులో ఇప్పటివరకు కేవలం 5,636 మందే సీటు వచ్చిన కళాశాలల్లో రిపోర్టు చేశారు. రిపోర్టు చేసే గడువు ముగిసినా ఇంకా 2,492 మంది విద్యార్థులు చేరలేదు. వీరికి కళాశాల మార్చుకునేందుకు కానీ రెండో కౌన్సిలింగ్‌ సీటు కేటాయించే పరిస్థితి కానీ లేదు. ఖచ్చితంగా సీటు కేటాయించిన కళాశాలలోనే ప్రవేశం పొందాల్సి ఉన్నా గడువు ముగిసినా స్పందన రాలేదు. అయితే, చాలా మంది విద్యార్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోగా సీటు వచ్చిన వారు కళాశాలలో చేరే రోజే ఫీజు చెల్లించాలన్న నిబంధన ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో పలువురు అప్పు చేసి మరీ ప్రవేశాలు పొందగా.. మరికొందరు దూరంగా ఉండిపోయారు.


ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులా ?
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 21 ఉండగా సాదారణంగా చాలా మంది ప్రభుత్వ కళాశాలల్లో సీటు కోరుకుంటారు. ఇదేవిధంగా ఆప్షన్లు ఇచ్చే సమయంలో ప్రభుత్వ కళాశాల అంటే ఫీజు చెల్లించాల్సిన అవసరముండదని భావించారు. కానీ సీట్లు వచ్చిన విద్యార్థులు సాధారణ కోర్సులైతే రూ.2,500, సెల్ప్‌ పైనాన్స్‌ కోర్సులైతే రూ.4,875 ఖచ్చితంగా చెల్లించాలని ప్రభుత్వ కళాశాలల అధికారులు హుకూం జారీ చేస్తున్నారు. అయితే, దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో వెబ్‌సైట్‌లో ఈ నిబంధన లేకపోగా ఇప్పుడూ లేదని కొందరు చెబుతున్నారు. కానీ కొన్ని కళాశాలల ఉద్యోగులు ఫీజు తప్పనిసరి అని చెబుతుండడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. చాలామంది విద్యార్థులు అప్పు చేసి ఫీజు కట్టగా.. మరికొందరు ప్రవేశాలకు దూరంగా ఉండిపోయారు. మొదటి దశలో ప్రభుత్వ కళాశాల్లోనే అధికంగా సీట్లు కేటాయించినా 2,492 మంది కళాశాలల్లో చేరకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. కాగా, యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలల్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి.. అందులో ఎందరు విద్యార్థులకు సీట్లు కేటాయించాలి.. ఎంత ఫీజు నిర్ధారించాలనే అంశాలను ప్రభుత్వం యూనివర్సిటీల పరిధి నుండి తొలగించింది. ఈక్రమంలో చాలా వరకు కోర్సులు, ఫీజుల వివరాలు తప్పుగా కనిపిస్తున్నాయి.


దరఖాస్తుకు రూ.600
దోస్ట్‌ ద్వారా దరఖాస్తులో భాగంగా రిజిస్ట్రేషన్‌కు రూ.200 గా నిర్ణయించిన ప్రభుత్వం, రెండో దశలో దాన్ని రూ.400 కు పెంచింది. రిజిస్ట్రేషన్‌ ఫీజుతో పాటు మీ సేవ సెంటర్లకు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఇక జిరాక్స్‌లు, ఇతరత్రా ఖర్చులకు కలిపి ఇది రూ.600 కు చేరుతోంది. తద్వారా విద్యార్థులకు దరఖాస్తు దశ నుంచే ఆర్థిక భారం వెంటాడుతుండగా.. ఇప్పుడు ప్రవేశాల సమయంలో ఫీజు కట్టాలన్న ప్రచారం వారిని ఆవేదనకు గురి చేస్తోంది.


కళాశాల్లో చేరాల్సిందే...
మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించిన కళాశాలల్లో ఖచ్చితంగా చేరాలన్న నిబంధన ఉంది. అయితే ఏవైనా ఇబ్బందులు కారణంగా మొదటి దశలో ప్రవేశం పొందకపోతే ఇతర కళాశాలల్లో ప్రవేశాలు పొందే అవకాశం లేకుండా పోయింది. దరఖాస్తు సమయంలో ఐదు నుండి పది కళాశాలను ఎంపిక చేసుకోగా దూరంగా ఉన్న కళాశాలలో సీటు వస్తే.. ఇతర కళాశాలకు మార్చుకునే అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. తద్వారా విద్యార్థులు కేటాయించిన కళాశాలల్లోనే ప్రవేశం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి ప్రాధాన్యత కింద ఏదైనా ప్రైవేట్‌ కళాశాలలో సీటు కోరుకున్నా... దూరంగా ఉన్న ప్రైవేట్‌ కళాశాలల్లోనే సీటు వచ్చిందని పలువురు వాపోతున్నారు.  

మరిన్ని వార్తలు