‘దోస్త్‌’తో ఈపాస్‌ లింక్‌..!  

31 May, 2020 03:26 IST|Sakshi

డిగ్రీ ప్రవేశాల వివరాలను ఈపాస్‌తో అనుసంధానానికి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల అమలును సులభతరం చేయాలని, పాత పద్ధతిలో దరఖాస్తు పూరించడం, వివరాలు ఎంట్రీ చేయడంలాంటి పనులకు ఇకపై చెక్‌ పెట్టాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. అందులో భాగంగా దోస్త్‌ వెబ్‌సైట్‌ను ఈ పాస్‌ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతోంది. కౌన్సెలింగ్‌ సమయంలో విద్యార్థులు దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. సీటు వచ్చిన కాలేజీ వివరాలు, ఏ కోటాలో సీటు వచ్చింది, విద్యార్థి కులం, కోర్సు, ఫీజు తదితర వివరాలన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ వివరాల ఆధారంగా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు అమలు చేయవచ్చు. ఇందుకు దోస్త్‌ వెబ్‌సైట్‌ను ఈపాస్‌ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయాలని సంక్షేమ శాఖలు చర్యలు వేగవంతం చేశాయి. 

కౌన్సెలింగ్‌ నాటికి పూర్తి...
లాక్‌డౌన్‌ కారణంగా ఇంటర్మీడియెట్‌ ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. కౌన్సెలింగ్‌ తేదీలు ప్రారంభమయ్యే నాటికి ఈ వెబ్‌సైట్ల అనుసంధానం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీజీజీ(సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌)తో సంక్షేమ శాఖలు పలుమార్లు చర్చలు జరిపి వెబ్‌సైట్‌ అనుసంధానంపై పలు సూచనలు చేశాయి. ఇటీవల ఈపాస్‌ వెబ్‌సైట్‌ను సైతం అప్‌డేట్‌ చేయడంతో లాగిన్‌ పేజీలో ఆప్షన్లు పెరిగాయి. తాజాగా దోస్త్‌ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేస్తే డిగ్రీ చదివే విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం కొత్తగా వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. దోస్త్‌ లింక్‌ ద్వారా ఈపాస్‌ పేజీ తెరిస్తే దాదాపు అన్ని వివరాలు అందులో ప్రత్యక్షమవుతాయి. అందులో పొరపాట్లు ఉంటే సరిచేయడం, అదనపు సమాచారాన్ని ఎంట్రీ చేసే వీలుంటుంది.

మరిన్ని వార్తలు