డబుల్‌

19 Feb, 2018 07:49 IST|Sakshi

ముందుకు సాగని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు

నిర్మాణానికి ఆసక్తి కనబరచని కాంట్రాక్టర్లు

మెటీరియల్‌ ధరలు పెరగటంతో ఇబ్బందులు

పూర్తి కాని టెండర్ల ప్రక్రియ

వేచి చూస్తున్న లబ్ధిదారులు

సాక్షి, మెదక్‌: జిల్లాలో డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ముందకు సాగడం లేదు.  నిర్మాణానికి కాంట్రాక్టర్లు మందుకు రాకపోవడం ఒక కారణమైతే, కావల్సిన మెటీరియల్‌ ధరలు అమాంతంగా పెరగడం మరో కారణం.  దీంతో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలు చోట్ల ఇంకా టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కాలేదు.  జిల్లాలోని లబ్ధిదారులు ఇళ్ల కోసం మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అర్హులైన పేదలకు వారి సొంతింటి కల నెరవేర్చాలని భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో నిర్మాణ     పనులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో నేటికీ ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం జిల్లాకు 4,929 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు 4,589 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో 950, గ్రామీణ ప్రాంతాల్లో 3,639 ఇళ్ల నిర్మాణం పనులను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించారు. 1,854 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు మందుకు వచ్చారు. మిగితా 2,735 ఇళ్ల నిర్మాణాలకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. 

ఎన్నికలు సమీపిస్తున్నా..
జిల్లాలో 1,854 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు ఫైనల్‌ అయ్యాయి.వీటిలో 1,704 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.  మెదక్‌ మండలం పల్లికొటాల, చేగుంట, బోనాలకొండాపూర్, తూప్రాన్‌ మండలం కోనాయిపల్లి, నర్సాపూర్, శివ్వంపేట మండలంలోని దంతాన్‌పల్లి, వెల్దుర్తిలో పనులు ప్రారంభమయ్యాయి.  వీటిలో 1,430 ఇళ్ల నిర్మాణం పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. 85 ఇళ్ల నిర్మాణం పనులు పిల్లర్ల దశలో ఉండగా.. 100 వరకు రూఫ్‌ లెవల్‌కు చేరుకున్నాయి. 63 ఇళ్ల గోడలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 26 ఇళ్ల గోడలు పూర్తి అయ్యాయి. ఆయా ఇళ్ల నిర్మాణానికిగాను ఇప్పటి వరకు రూ.1.44 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు ఒక్కచోటా కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి తోడు ఇంకా 2,735 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఓవైపు ఎన్నికల సమయం సమీపిస్తున్నా ఇంకా డబుల్‌ పనులు పూర్తికాక పోవడంతో ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ముందుకు రావడం లేదు..
ప్రభుత్వం సూచించిన రూ.5.30 లక్షల వ్యయంతో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం లేదు. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్‌లో స్క్వయర్‌ ఫీట్‌కు రూ.1,350 చెల్లిస్తుండగా.. జిల్లాలో మాత్రం రూ.900 చెల్లిస్తోంది.  దీంతో కాంట్రాక్టర్లు నిర్మాణం పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు.  స్టీల్‌ ధర గణనీయంగా పెరగడంతో మరింత భయపడుతున్నారు. ప్రసుత్తం నిర్మాణం పనులు చేపడితే ఆర్థికంగా నష్టపోతామన్న భావన కాంట్రాక్టర్లలో నెలకొంది. దీంతో ఇళ్ల నిర్మాణం పనులు సకాలంలో పూర్తికాని పరిస్థితి ఉంది.

మరిన్ని వార్తలు