డబుల్‌.. ట్రబుల్‌  

20 Mar, 2018 08:30 IST|Sakshi
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం (ఫైల్‌ ఫోటో)

ఇళ్ల నిర్మాణ పనుల్లో జిల్లా వెనుకంజ

జిల్లాకు 2,713 మంజూరు.. 150 మాత్రమే పూర్తి

మానుకోట నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానం

మిగతా చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు

కొత్తగూడ, గంగారంలో మొదలు కాని పనులు

నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేసింది. అయితే జిల్లాలో ఈ ఇళ్ల నిర్మాణ పనుల్లో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. పలు చోట్ల ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పటికీ పునాదులు, పిల్లర్లు, గోడలు, స్లాబ్‌ లెవల్‌లో ఉన్నాయి. కొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. జిల్లాకు మొదటి, రెండో విడతల్లో మొత్తం 2,713 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 150 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిపోతోంది. అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

మహబూబాబాద్‌: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో జిల్లా చాలా వెనుకబడి ఉంది. జిల్లాకు రెండు విడతల్లో 2,713 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 1,439 ఇళ్లకు టెండర్లు పిలిచారు. 1,006 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశారు. 684 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభమైన ఇళ్లు సైతం 25శాతం కూడా పూర్తి కాలేదు. మార్చి 31వ తేదీ వరకు కాంట్రాక్టర్లకు గడువు ఇవ్వగా పూర్తయ్యే పరిస్థితే లేదు.

జిల్లాలో పరిస్థితి...
జిల్లాకు మొదటి విడతలో 1,433, రెండో విడతలో 1,280.. మొత్తం 2,713 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరయ్యాయి. మానుకోట నియోజకవర్గానికి మొదటి విడతలో 400, రెండో విడతలో 625, డోర్నకల్‌కు మొదటి విడతలో 400, పాలకుర్తి నియోకవర్గానికి 429, ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలకు 160, ములుగు నియోజకవర్గంలోని గంగారం, కొత్తగూడ మండలాలకు 44 గృహాలు మంజూరయ్యాయి. మొత్తం 2,713 ఇళ్లకు 150 మాత్రమే పూర్తయ్యాయి. పాలకుర్తి, ఇల్లందు నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణ పనులు కొంత వేగంగా సాగుతుండగా, ములుగు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో పనులే ప్రారంభం కాలేదు.

మానుకోట నియోజకవర్గంలో నిల్‌
మహబూబాబాద్‌ నియోజకవర్గంలో 300 ఇళ్లకు టెండర్లు పూర్తి కాగా 245 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా 55 పనులే మొదలు కాలేదు. ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. మహబూబాబాద్‌ మండలంలో 200 ఇళ్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో పిల్లర్ల దశలోనే ఉన్నాయి. నెల్లికుదురు మండలం చిన్నముప్పారంలో 25 ఇళ్లకు 16 ఇళ్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి గ్రామంలో 15 ఇళ్లు ప్రారంభంం కాగా, కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో 14 ప్రారంభమయ్యాయి. చిన్నముప్పారంలోని 7గృహాలు, పెనుగొండలోని 2గృహాలకు ప్లాస్టరింగ్‌ పనులు చేస్తున్నారు.

డోర్నకల్‌ నియోజకవర్గంలో వివిధ దశల్లో...
నియోజకవర్గానికి మొత్తం 400 ఇళ్లు మంజూరుకాగా, 270 టెండర్లు పూర్తయ్యాయి. 215 ఇళ్ల పనులు ప్రారంభం కాగా 60 మాత్రమే పూర్తయ్యాయి. డోర్నకల్‌ మండలానికి 70 ఇళ్లు మంజూరు కాగా వెన్నారం గ్రామంలో 18 ఇళ్లు పూర్తి కాగా, మిగతా 52 ఇళ్ల పనులు ఇటీవల మొదలయ్యాయి. మరిపెడ మండలం చిల్లంచెర్లలో 50 ఇళ్లు మంజూరై 25 ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్లంపేటలో 50 ఇళ్లకు 42 పూర్తయి 5 వివిధ దశల్లో ఉండగా 2 ఇంకా పనులు చేపట్టలేదు. దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో 50కి మొత్తం పనులు ప్రారంభమై 30 గోడల దశలో, 12 స్లాబ్‌ దశలో, 8 ప్లాస్టరింగ్‌ దశలో ఉన్నాయి. నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి 50కి మొత్తం ప్రారంభమై 6గోడల దశలో, 37 స్లాబ్‌ దశలో, 7 బేస్‌మెంట్‌ స్థాయిల్లో ఉన్నాయి.

పాలకుర్తి నియోజకవర్గంలో 30 ఇళ్లు పూర్తి
పాలకుర్తి నియోజకవర్గంలో జిల్లా పరిధిలోకి వచ్చే తొర్రూ రు, పెద్ద వంగర మండలాలకు 429 ఇళ్లు మంజూరయ్యా యి. వీటిలో 367 టెండర్లు పూర్తికాగా, 175 ప్రారంభమై 30గృహాలు పూర్తయ్యాయి. పెద్దవంగర మండలంలోని పోలంపల్లికి 23మంజూరు కాగా అన్నీ ప్రారంభమయ్యాయి. ఉప్పరిగూడెం గ్రామానికి 20 మంజూరు కాగా అన్నింటి పనులు ప్రారంభమయ్యాయి. వివిధ దశల్లో ఉన్నాయి. కొరి పెల్లి గ్రామానికి 60 ఇళ్లు మంజూరై 30 ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. గట్లకుంట గ్రామానికి 10 మంజూరై అన్నిం టి పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో 21 మంజూరై అన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. నాంచారిమడుగు గ్రామానికి 50 మంజూరై 30 ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి.

ఇల్లందు నియోజకవర్గంలో దాదాపు పూర్తి
ఈ నియోజకవర్గంలో జిల్లా పరిధిలోకి వచ్చే గార్ల, బయ్యారం మండలాల్లో 160 ఇళ్లు మంజూరై 140 ప్రారంభమయ్యాయి. వీటిలో 60 ఇళ్లు పూర్తయ్యాయి. మిగతా వాటిలో 50 ప్లాస్టరింగ్‌ దశలో, 10 స్లాబ్‌ పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. బయ్యారం మండలం రామచంద్రాపురానికి మంజూరైన 20, నామాలపాడులో మంజూరైన 20, బాలాజీపేటకు మంజూరై 20 పూర్తయ్యాయి. ఇసుకమేది గ్రామానికి 20 మంజూరు కాగా వివిధ దశల్లో ఉన్నాయి. గార్ల మండలం గుంపెళ్లగూడెంకు మంజూరైన 20 ప్లాస్టరింగ్‌ దశలో ఉండగా, పూసలతండాలో మొత్తం 20 స్లాబ్‌ దశలో ఉన్నాయి. సూర్యాతండాలో 20 ప్రారంభమై స్లాబ్‌లు పూర్తయ్యాయి. శేరిపురం గ్రామానికి 20 మంజూరై స్థలం లేక ప్రారంభంకాలేదు.

ములుగు నియోజకవర్గంలో మొదలు కాని పనులు
నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం గ్రామాలు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆయా మండలాలకు 44 ఇళ్లు మంజూరయ్యాయి. కొత్తగూడకు 37, పొనుగోడుకు 3గృహాలు మంజూరు కాగా, నేటికీ టెండర్లు కూడా పూర్తికాలేదు. మార్చి 31 వరకు మొదటి విడత గృహాలు పూర్తి కావాల్సి ఉండే చివరికి 2విడతలకు 684 గృహాలు మాత్రమే ప్రారంభం కాగా, వాటిలో కూడా 150 మాత్రమే పూర్తయ్యాయి. గడువులోగా ప్రారంభమైన గృహాలు సైతం పూర్తయ్యే పరిస్థితి లేదు. జిల్లాలోని గార్ల మండలం శేరిపుర  గ్రామంలో స్థల సమస్యతో డబుల్‌బెడ్రూం ఇండ్లు ప్రారంభం కాలేదు.


 

మరిన్ని వార్తలు