‘డబుల్‌’ కల నెరవేరేనా..?

29 Mar, 2018 08:19 IST|Sakshi
కంకణాలగూడెంలో ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం

నారాయణపురంలో ప్రారంభంకాని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ  పనులు

సర్వేల్‌లో శరవేగంగా..

పేదల ఎదురుచూపులు

సంస్థాన్‌ నారాయణపురం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. మండలంలో 14 గ్రామాలు ఉంటే, మొదటి విడత సర్వేల్‌లో రెండు ఎకరాల భూమిలో 64, సంస్థాన్‌ నారాయణపురం గ్రామానికి సంబంధించి కంకణాలగూడెం గ్రామా రెవెన్యూ పరిధిలో మూడు ఎకరాల భూమిలో 138 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సర్వేల్‌లో గతేడాదే.. నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. సంస్థాన్‌ నారాయణపురంలో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. మిగతా 12 గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. 
సర్వేల్‌లో పురోగతి..
నియోజకవర్గంలో సర్వేల్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మొట్టమొదట నిర్వహించారు. రూ.3.78కోట్లతో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దసరా నాటికి గృహప్రవేశాలు చేసేలా పనులు సాగుతున్నాయి. కానీ సంస్థాన్‌ నారాయణపురంలో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఇక్కడ ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మిగతా గ్రామాల్లో కూడా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు