ప్రతి పేదోడికి ఇల్లు.. అదే సీఎం స్వప్నం

21 Feb, 2019 02:59 IST|Sakshi
లబ్ధిదారులకు నివేశన స్థల పట్టాలను అందజేస్తున్న కేటీఆర్‌

సాక్షి, సిరిసిల్ల: రాష్ట్రంలో ఇళ్లులేని వారు ఉండొద్దన్నదే తమ లక్ష్యమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. గూడులేని వారికి ఇళ్లను అందించి పేదరికాన్ని రూపుమాపడం కోసం డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో గతంలో పేదలకు ప్రభుత్వం అందజేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలను కేటీఆర్‌ బుధవారం అందజేశారు. ఒకేసారి 3,052 మందికి పట్టాలు పంపిణీ చేసిన కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. నేతన్నలు, గీతన్నలు, కులవృత్తుల పేదరికాన్ని నిర్మూలించడానికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలు ఇళ్లు లేనివారిగా ఉండరాదన్నది సీఎం స్వప్నమని తెలిపారు. 

ఎవరికీ లంచం ఇవ్వొద్దు
పేదలకు నిర్మించి ఇచ్చే డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇళ్ల కోసం ఎవరికీ ఒక్కపైసా లంచం ఇవ్వొద్దని చెప్పారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా ప్రభుత్వం దగ్గర సమగ్ర సమాచారం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉండి డబుల్‌ ఇళ్లు పరిమితంగా ఉంటే లాటరీ వేసైనా సరే పైసా లంచం లేకుండా పారదర్శకంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. 

సిరిసిల్ల పేరు ప్రతి ఆడబిడ్డ తలచుకుంటోంది
సిరిసిల్ల నేతన్నల కళానైపుణ్యానికి ప్రతిరూపమైన బతుకమ్మ చీరలను కట్టుకుని రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సిరిసిల్ల పేరు తలచుకుంటోందని కేటీఆర్‌ చెప్పారు. అలాంటి బతుకమ్మ చీరలు ఇంకా బాగా తయారుచేసి, బ్రహ్మాండమైన చీరతో ఆడబిడ్డల ఆశీర్వాదం పొందాలన్నారు. సిరిసిల్లలో అపెరల్‌ పార్కు ద్వారా మహిళలకు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం లభించేలా శిక్షణ ఇస్తామన్నారు. నేతన్నలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల స్థిరమైన ఆదాయం లభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రానికి ఇంటి పెద్దలా ఉండి అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని, అలాగే ప్రజలు కూడా కడుపు నింపేలా బ్రహ్మాండమైన తీర్పునిచ్చారన్నారు. తనను 89 వేల భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని, పేదలకు సాయం చేసి మాత్రమే కొంత రుణం తీర్చుకోగలనని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు