డబుల్‌ మిఠాయికి.. డబ్బుల్‌ బూజు

7 May, 2018 02:19 IST|Sakshi
డబుల్‌ బెడ్రూం పథకం

దళారుల చేతివాటంతో పక్కదారి పడుతున్న ‘డబుల్‌ బెడ్రూం’ పథకం

ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల వరకు వసూళ్లు

కోరుకున్నవారికే కేటాయింపులు జరిపేలా దళారుల ఎత్తుగడ

ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట, పాలమూరు జిల్లాల్లో

‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన  ఈ ఇంటి నంబర్‌ 14–2–109. ఓ అగ్రవర్ణ వ్యాపార వర్గానికి చెందిన ఆయన ఈ ఇంటి యజమాని. ఆయనకు భద్రాచలంలో కిరాణా షాపు ఉంది. ఇద్దరు కుమారులూ వ్యాపారంలో స్థిరపడ్డారు. ఇలాంటి కుటుంబానికి డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరైంది. ఈ యజమాని కోడలుకు ఆమె భర్త పేరులో చిన్న మార్పు చేసి.. 83వ నంబర్‌ ఇల్లు మంజూరు చేశారు. అంతేకాదు.. భద్రాచలంలో 1/70 చట్టం అమల్లో ఉంది. ఇక్కడ అగ్రవర్ణాల ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు పీసా కమిటీ అనుమతి తప్పనిసరి. అధికారులు ఆ నిబంధననూ తుంగలో తొక్కి ఇల్లు మంజూరు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకంలో అవకతవకలకు చిన్న ఉదాహరణ ఇది. ఇదొక్కటే కాదు.. ఒక్క భద్రాచలంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. డబుల్‌ ఇళ్ల పథకంలోకి చొరబడిన దళారుల చేతివాటం, వారికి కక్కుర్తి అధికారుల సహకారం కలసి ప్రతిష్టాత్మక పథకం నిర్వీర్యమవుతోంది. పేదవాడి కల అయిన సొంతిల్లు.. ‘మామూళ్ల’దందా మధ్యన పక్కదారి పడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,522 ఇళ్లను లబ్ధి్దదారులకు అప్పగించగా.. ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగతా అన్నిచోట్ల కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’బృందం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎక్కువగా ఫిర్యాదులు అందిన గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించింది. భద్రాచలం పట్టణంలో 88 ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన జాబితాను క్షుణ్నంగా పరిశీలించగా.. అందులో ఏకంగా 52 ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్టు స్పష్టమైంది. మిగతా చోట్లా ఇదే పరిస్థితి కనిపించింది. 
 
ప్రతిష్టాత్మక లక్ష్యంతో.. 
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతిల్లు కట్టించాలన్న బృహత్తర లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకాన్ని చేపట్టారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2.73 లక్షల ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1.51 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు 9,522 ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించారు. కానీ దళారుల రంగ ప్రవేశంతో ఈ ఇళ్ల కేటాయింపులో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. ఆయా గ్రామాలకు ఎన్ని ఇళ్లు కేటాయించవచ్చని స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం తీసుకుంటారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక గృహ ప్రవేశ సమయంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి.. గుడిసె కూడా లేని నిరుపేదలను గుర్తించి, వారికి మొదటి ప్రాధాన్యత కింద ఇళ్లను కేటాయించాలి. ఎక్కువ మంది అర్హులు ఉంటే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ ఇలాంటివేవీ లేకుండా ‘మామూలు’గానే కేటాయింపులు జరిగిపోతున్నాయి. 
 
ఒక్కో ఇంటికి రూ.2.5 లక్షల వరకు..! 
కొందరు ఎమ్మెల్యేల అనుచరుల పేరిట దళారుల అవతారం ఎత్తారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆర్థికంగా బాగున్న కుటుంబాలను గుర్తించి.. ఇళ్లు ఇప్పిస్తామంటూ బేరసారాలకు దిగుతున్నారు. గ్రామాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల వరకు ఒప్పందం చేసుకుని రెండు మూడు దఫాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అటు ఎమ్మెల్యేల పేరు చెప్పి, ప్రలోభాలు ఎరచూపి రెవెన్యూ అధికారులను తమ వైపునకు తిప్పుకొంటున్నారు. గ్రామ సభ తీర్మానం, లాటరీ విధానం వంటివేవీ లేకుండానే తాము కోరుకున్నవారికి ఇళ్లు మంజూరు చేయించుకుంటున్నారు. 
 
ఇల్లున్నా.. ట్రాక్టరున్నా.. పొలమున్నా.. 
మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం నిజాలపురంలో 236 మంది డబుల్‌ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ గ్రామానికి మొదటి విడతలో 20 ఇళ్లు, రెండో విడతలో 70 ఇళ్లు కేటాయించారు. మొదటి విడత 20 ఇళ్లు పూర్తయి లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. నిబంధనల ప్రకారం ఇక్కడ లాటరీ తీయాలి. కానీ రెవెన్యూ అధికారులు దళారుల కనుసన్నల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇలా ఇళ్లు కేటాయించిన వారిలో.. అప్పటికే ఇల్లున్నవారు ముగ్గురు, ట్రాక్టర్‌ ఉన్న వారు ఒక్కరు, వ్యవసాయ భూములున్నవారు ఏడుగురు ఉన్నట్టు స్థానికులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రెండో విడతలో వచ్చిన 70 ఇళ్లకు కూడా బేరసారాలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను సేకరించిన ‘సాక్షి’బృందం.. వారి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయగా ఎవరికీ డబ్బులివ్వలేదంటూ చెప్పుకొచ్చారు. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ కొందరు దళారులు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 
 
డబ్బున్నోళ్లకే ఇళ్లు.. 
భద్రాచలం పట్టణంలో ఏడు వేల మంది డబుల్‌ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొగా.. అందులో 3,800 మంది అర్హులని అధికారులు తేల్చారు. ఇళ్ల నిర్మాణం కోసం పట్టణంలోని కొర్రాజులగుట్ట వద్ద స్థలాన్ని ఎంపిక చేశారు. అది ఖరీదైన ప్రాంతం. ఇక్కడ తొలివిడత 88 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా.. లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ ఒక్కో ఇంటి విలువ మార్కెట్‌రేటు ప్రకారం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండటంతో.. విపరీతంగా పోటీ ఏర్పడింది. వాస్తవానికి భారీగా దరఖాస్తులున్న నేపథ్యంలో లాటరీ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలి. పైగా ఇక్కడ 1/70 చట్టం అమల్లో ఉంది. అంటే కేటాయింపుల్లో గిరిజనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. నగర పంచాయతీ తీర్మానంతోపాటు, పీసా కమిటీ అనుమతి తీసుకుని గిరిజనేతరులకు ఇళ్లు కేటాయించాలి.

కానీ అధికారులు ఇందులో ఒక్క నిబంధన కూడా పాటించలేదు. మొత్తం ఇళ్లలో అధికార పార్టీకి 40 శాతం, ఓ వామపక్ష పార్టీకి 30 శాతం, ఇతర ప్రతిపక్షాలకు 20 శాతం, మిగతా ఇళ్లను రెవెన్యూ అధికారులు పంచుకున్నట్టు తేలింది. ఎవరికి వారు తమకు డబ్బులిచ్చిన వారికి తమ వాటాగా వచ్చిన ఇళ్లను కేటాయింపజేసుకున్నట్టు తెలిసింది. స్థానికంగా ఉన్న ఒక దేవాలయం కమిటీ (రామాలయ కమిటీ కాదు) చైర్మన్‌ సహా సభ్యులు గుండుగుత్తగా ఇళ్లు తీసేసుకున్నారు. ఇంకా వ్యాపారులు, ఫైనాన్స్‌ వ్యాపారులు, ఓ వామపక్ష పార్టీ నేతల సన్నిహితులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఇప్పటికే పక్కా ఇళ్లున్నవారు కూడా డబ్బులిచ్చి ఇళ్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక తహసీల్దార్‌ రామకృష్ణను వివరణ కోరగా.. డబుల్‌ ఇళ్ల కేటాయింపుల్లో ఎలాంటి పొరపాట్లు జరగలేదని పేర్కొన్నారు. 

స్థలం కొనుగోలు కోసమంటూ వసూళ్లు.. 
నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లోనే డబుల్‌ ఇళ్ల నిర్మాణం చేసి, లబ్ధిదారులకు ఇవ్వాలి. కానీ అనేక గ్రామాల్లో ప్రభుత్వ స్థలం కొరత ఉంది. దీంతో దళారులు ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలం కొనుగోలు చేసి.. ప్రభుత్వానికి ఇస్తామంటూ దరఖాస్తుదారుల నుంచి రూ.40 వేల నుంచి రూ. 60 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇళ్ల కేటాయింపు కోసమంటూ మరో రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మెదక్‌ జిల్లా రాయినిపల్లిలో 40 ఇళ్లు మంజూరుకాగా.. స్థానిక నేత ఒకరు ఇళ్ల స్థలాల కోసమని ఒక్కో దరఖాస్తుదారు నుంచి రూ. 40 వేలు వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందాయి. అదే జిల్లా హవేలిఘనపురం మండలం కూచన్‌పల్లిలోనూ, ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోనూ, సూర్యాపేట జిల్లా సూర్యాపేట, పెన్‌పహాడ్‌ మండలాల్లోనూ ఇదే రకమైన ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. అందులో సుమారు 60 శాతం ఇళ్లకు సంబంధించి ఇదే రకమైన ఆరోపణలు వస్తున్నాయి.  

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు ఓ ఫైనాన్స్‌ వ్యాపారిది. ఇంటి నంబర్‌ 14–2–10. భద్రాచలం నగర పంచాయతీకి ఏడాదికి రూ.2,279 ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నారు. ఇటీవలే ఎన్నికల కమిషన్‌ నుంచి విడుదలైన ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. ఇదే ఇంటి నంబర్‌లో ఆయనకు, ఆయన భార్యకు ఓటు హక్కు కూడా ఉంది. ముడుపులు పుచ్చుకున్న అధికారులు ఆయన పేదవాడంటూ, ఆయన భార్య పేరును కూడా మార్చేసి మరీ 88వ నంబర్‌ డబుల్‌ బెడ్రూం ఇంటిని కేటాయించారు. (ఫోటో నంబర్‌ వీవీ02)  

మరిన్ని వార్తలు