ఇన్విజిలేటర్ల వల్లే డబుల్‌ బబ్లింగ్‌ 

1 Feb, 2019 00:28 IST|Sakshi

హైకోర్టుకు నివేదించిన గ్రూప్‌–2 అభ్యర్థులు 

సాక్షి, హైదరాబాద్‌: ఇన్విజిలేటర్లకు తగిన అవగాహన లేకపోవడం వల్ల గ్రూప్‌–2 పరీక్షల్లో డబుల్‌ బబ్లింగ్‌ చోటు చేసుకుందని పలువురు అభ్యర్థులు హైకోర్టుకు నివేదించారు. వ్యక్తిగత వివరాలను ఎలా నమోదు చేయాలన్న విషయంలో ఇన్విజిలేటర్లకు అవగాహన లేకపోవడం వల్ల, వారు తమకు సరైన మార్గదర్శకత్వం చేయలేదని, దీంతో డబుల్‌ బబ్లింగ్‌ చోటు చేసుకుందని వారు వివరించారు. ఈ డబుల్‌ బబ్లింగ్‌కు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కూడా ఓ కారణమని తెలిపారు. గ్రూప్‌–2 పరీక్షలో డబుల్‌ బబ్లింగ్‌ చేసిన అభ్యర్థులను, వైట్‌నర్‌ వాడిన వారికి, వ్యక్తిగత వివరాలు నమోదు చేయని వారికి తదుపరి ప్రక్రియలో అవకాశం ఇవ్వరాదంటూ సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పలువురు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై గురువారం న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అభ్యర్థుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గందరగోళం వల్ల కొన్ని తప్పులు జరిగినట్లు సాంకేతిక కమిటీ కూడా తేల్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లను తీవ్రంగా పరిగణిస్తే అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీనియర్‌ న్యాయవాదుల కమిటీ కూడా డబుల్‌ బబ్లింగ్‌ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది.    

మరిన్ని వార్తలు