భవిష్యత్‌లో ఫ్లై ఓవర్లు ఇవే!

29 Nov, 2019 11:35 IST|Sakshi

మెట్రో రెండో దశ, జీహెచ్‌ఎంసీ

ఫ్లై ఓవర్లకు అవకాశమున్న ప్రాంతాల్లో ఆల్విన్‌ క్రాస్‌రోడ్

సాక్షి, హైదరాబాద్‌ : మహానగరం రూపురేకలు సమూలంగా మార్చేందుకు.. తక్కువ స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇకపై ఏ ప్రభుత్వ విభాగం ఫ్లై ఓవర్‌ నిర్మించాల్సి వచ్చినా.. మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాల్సి వచ్చినా.. ఔటర్‌ రింగ్‌రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) వరకు డబుల్‌ డెక్కర్‌గా ఒకే పిల్లర్‌పై రెండు వరుసలకు వీలుగా నిర్మాణం చేపట్టాలంటున్నాయి జీహెచ్‌ఎంసీ వర్గాలు. తద్వారా భూసేకరణ, నిర్మాణ వ్యయంతో సహా ఇతరత్రా ఇబ్బందులు తగ్గుతాయని ఈ ఆలోచన చేశారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ అధికారుల బృందం ఇటీవల నాగ్‌పూర్, పుణే తదితర నగరాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించి రావడం తెలిసిందే.

నాగ్‌పూర్‌లో ఒకే పిల్లర్‌పై రెండు వరుసలతో వంతెనను నిర్మించారు. కింది వరుసలో వాహనాలు, పైవరుసలో మెట్రోరైలు ప్రాణానికి అనువుగా మార్చారు. అక్కడి నిర్మాణాన్ని చూసి నగరంలోనూ అలాంటి విధానాన్నే అమలు చేయాలని భావించారు. గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతో పాటు నేషనల్‌ హైవే, తదితర విభాగాలు ఆయా మార్గాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించనున్నాయి.మెట్రో రైలు రెండో దశలో భాగంగా వివిధ మార్గాల్లో పనులు చేపట్టనున్నారు. దీంతో అన్ని విభాగాలు ఫ్లైఓవర్లు నిర్మించేటప్పుడు ఒకే పిల్లర్‌పై రెండు వరుసల్లో ప్రయాణాలు సాగేలా నిర్మిస్తే భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

మెట్రో రైలు మార్గాల్లో పైవరుసను మెట్రో కకోసం వినియోగిస్తారు. మెట్రో లేని మార్గాల్లో తొలుత ఒక వరుసలో నిర్మించాక, మరో వరుసలో కూడా నిర్మించేందుకు వీలుగా తగిన ఆధునిక సాంకేతికతతో పిల్లర్లను నిర్మిస్తారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా సదరు మార్గంలో రెండో వరుసలో కూడా వాహనాల కోసం మరో ఫ్లై ఓవర్‌ నిర్మించవచ్చునని మేయర్‌ పేర్కొన్నారు. ఒకవేళ మెట్రోరైలు మార్గమే తొలుత నిర్మిస్తే, దిగువ వరుసలోని మార్గాన్ని వాహనాల కోసం వదిలి పైవరుసలో మెట్రో కోసం నిర్మాణం చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సైతం ఈ విధానం బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు పురపాలకశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందని, త్వరలో జీఓ వెలువడే అవకాశం ఉందని రామ్మోహన్‌ తెలిపారు.  

బెస్ట్‌ సిటీ కోసం.. 
నగరాన్ని వివిధ అంశాల్లో బెస్ట్‌ సిటీగా నిలిపేందుకు ఆయా నగరాల్లో అమల్లో ఉన్న బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ను పరిశీలిస్తున్నామని మేయర్‌ తెలిపారు. ఢిల్లీలో చెత్త సేకరణ, నిర్వహణ మాదిరిగా హైదరాబాద్‌లోనూ చెత్త తరలింపు కోసం వినియోగించే వాహనాలు చెత్త బయటకు కనపడకుండా పూర్తిగా ఉండేవాటిని తీసుకోనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు