‘పుర’ సమరానికి నిధుల పాచిక!

16 Mar, 2018 03:37 IST|Sakshi

      పురపాలక శాఖకు రెట్టింపు నిధులు

     గతేడాది రూ.2,869 కోట్లు.. తాజాగా రూ.4,680 కోట్ల కేటాయింపు

     పురపాలక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారీగా నిధులు

     హైదరాబాద్‌ రోడ్లకు రూ.566 కోట్లు

     వరంగల్‌ నగరానికి రూ.226 కోట్లు

     యాదగిరిగుట్టకు రూ.250 కోట్లు

     తొలిసారిగా ధర్మపురి, బాసరలకు చెరో రూ.50 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. వచ్చే ఏడాది పురపాలికలకు జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు నిధుల కేటాయింపులను భారీగా పెంచింది. ప్రగతి పద్దు కింద పురపాలక శాఖకు 2017–18లో రూ.2,869.22 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో కేటాయింపులను రూ.4,680.09 కోట్లకు పెంచింది.

వరంగల్‌ నగరానికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు రూ.301.88 కోట్ల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది. పురపాలికలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.117.23 కోట్ల నుంచి రూ.755.20 కోట్లకు పెంచింది. అయితే మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులకు సహాయక నిధులను మాత్రం రూ.426.41 కోట్ల నుంచి 230.10 కోట్లకు తగ్గించింది. మునిసిపల్‌ కార్పొరేషన్లకు వడ్డీ లేని రుణాలను రూ.7.55 కోట్ల నుంచి రూ.141.64 కోట్లకు పెంచింది. పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణ సహాయం అందించే టీయూఎఫ్‌ఐడీసీకి తొలిసారిగా రూ.200 కోట్లు కేటాయించింది. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన స్మార్ట్‌ సిటీకి రూ.150 కోట్ల నుంచి రూ.89.39 కోట్లకు కేటాయింపులను తగ్గించి, అమృత్‌ పథకానికి రూ.203.96 కోట్ల నుంచి రూ.313.63 కోట్లకు పెంచింది. స్వచ్ఛ భారత్‌కు రూ.115 కోట్ల కేటాయింపులను కొనసాగించింది.

ఆలయాలకు నిధుల వెల్లువ!
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు పెంచింది. యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.100 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.250 కోట్లకు పెంచింది. వేములవాడ ఆలయాల అభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లను కేటాయించింది. తొలిసారిగా భద్రాచలం ఆలయాభివృద్ధి సంస్థకు రూ.100 కోట్లు, ధర్మపురి, బాసర ఆలయాభివృద్ధి సంస్థలకు చెరో రూ.50 కోట్లను కేటాయించింది. 

‘మూసీ’ అభివృద్ధికి రూ.377 కోట్లు
ప్రగతి పద్దు కింద హైదరాబాద్‌లో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధికి రూ.377.35 కోట్ల కేటాయింపులను కొనసాగించి, రోడ్ల అభివృద్ధికి కేటాయింపులను రూ.377.35 కోట్ల నుంచి రూ.566.02 కోట్లకు పెంచింది. హైదరాబాద్‌ మెట్రో ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టుకు తొలిసారిగా రూ.400 కోట్లు కేటాయించింది. నిర్వహణ పద్దు కింద జలమండలి, హెచ్‌ఎండీఏ, మెట్రో రైలు సంస్థలకు బడ్జెట్లో భారీ ఎత్తున పెట్టుబడి రుణాలను కేటాయించింది. హైదరాబాద్‌ జలమండలికి రూ.1,420.50 కోట్ల రుణం, మెట్రో రైలుకు రూ.200 కోట్ల రుణం, హెచ్‌ఎండీఏకు రూ.250 కోట్ల రుణం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు కోసం మరో రూ.235 కోట్లను రుణాల కేటాయింపులను యథాతథంగా కొనసాగించింది.

మరిన్ని వార్తలు