ఇటు డబుల్ రోడ్లు, అటు వంతెనలు

22 Nov, 2014 01:20 IST|Sakshi

రూ.10వేల కోట్ల పనులకు అనుమతులు మంజూరు: సీఎం
 
హైదరాబాద్: తెలంగాణలో భారీఎత్తున రోడ్లు, వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇటీవల బడ్జెట్‌లో రూ. 10,663 కోట్లు కేటాయించడమేగాక వాటికి పరిపాలన అనుమతులు జారీ చేసింది. సింగిల్‌రోడ్ల స్థానంలో డబుల్ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండులేన్ల రోడ్లు, కృష్ణా, గోదావరి నదులు, ఇతర ఉప నదులు, వాగులపై వంతెనల నిర్మాణం, పాతరోడ్లకు మరమ్మతులు.. ఇలా రోడ్లు భవనాల శాఖకు చేతినిండా పనులను అప్పగించింది. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్‌రావు, సీఈ భిక్షపతి తదితరులతో సమీక్షించారు. వచ్చే రెండుమూడేళ్లలో అన్ని రోడ్లు బాగుపడాలని, వాటి నాణ్యతలో ఎట్టి పరిస్థితిలో రాజీపడవద్దని ఆయన స్పష్టం చేశారు.   నిర్మాణం తర్వాత ఐదేళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లకే అప్పగిస్తూ నిబంధనలు సవరించాలని తె లిపారు.
 
అనుమతి పొందిన పనులివే...
 
►రూ.3704 కోట్లతో 2721 కిలోమీటర్ల సింగిల్‌రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి.
► రూ.1974 కోట్లతో గోదావరి, కృష్ణా, ఇతర నదులు, ఉప నదులు, వాగులపై 390 వంతెనల నిర్మాణం.
► రూ.2585 కోట్లతో 149 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండులేన్ల రోడ్లనిర్మాణం.
► రూ.2400 కోట్లతో 10 వేల కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు.    
 
 

మరిన్ని వార్తలు