ఒకటా.. రెండా.. మూడా..!

30 Jul, 2014 03:55 IST|Sakshi
ఒకటా.. రెండా.. మూడా..!

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయా? ఒక్కో పార్లమెంటు స్థానంలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున పెంచితే జిల్లాలో పెరిగే నియోజకవర్గాల సంఖ్య మూడుకు చేరుతుందా? ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లడంతో ఒక్కటే పెరుగుతుందా? కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలేంటి? ఖమ్మం-2 వస్తుందా? ఏన్కూరు కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటవుతుందా? కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు తప్పవా?...అనే చర్చ ప్రస్తుతం జిల్లాలో జోరుగా సాగుతోంది. తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడంతో ‘పునర్విభజన’ లెక్కలు మళ్లీ మొదలయ్యాయి.
 
పునర్విభజన జరిగితే జిల్లాలో 12 నియోజకవర్గాలవుతాయని, కొత్తగా ఏర్పడే రెండు స్థానాలు జనరల్‌కు రిజర్వ్ అవుతాయని చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో కూడా అసెంబ్లీ స్థానం పెంపు అంశం ఉండడంతో 2019 ఎన్నికల నాటికి జిల్లాలోని నియోజకవర్గాల స్వరూపంలో మార్పులు కచ్చితంగా వస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు ప్రకియ్ర ప్రారంభమయ్యేందుకు చాలా సమయమున్నా... ముఖ్యమంత్రి లేఖ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, మేధావులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా డీలిమిటేషన్ చర్చ జరుగుతోంది.
 
ఏం జరగవచ్చు..?
జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీల్లో పలురకాల చర్చలు నడుస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్యతో పాటు రిజర్వేషన్ల మార్పుల అంశంపైనా ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రాథమిక అంచనా మేరకు జిల్లాలో పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు 12కు పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అంచనా. కొత్తగా ఖమ్మం-2, ఏన్కూరు నియోజకవర్గాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలంటున్నాయి. వారి అంచనాల ప్రకారం... ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం (రైల్వే ట్రాక్‌కు అవతలి వైపు), రూరల్ మండలాలను కలిపి ఖమ్మం-2 నియోజకవర్గం ఏర్పాటవుతుంది.
 
ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీలో భాగంగా ఉన్న ఖమ్మం 1, 2 టౌన్‌లు, రఘునాధపాలెం మండలం యథావిధిగా ఉంటాయి. ఇక పాలేరు నియోజకవర్గంలో ఉన్న రూరల్ మండలం ఖమ్మం-2లో కలిస్తే ముదిగొండ మండలం మళ్లీ పాలేరులోకి రానుంది. మధిర నుంచి విడిపోయి మళ్లీ పాతస్థానంలో కలిసే అవకాశం ఉంది. ఇక, మిగిలిన మధిర, బోనకల్, ఎర్రుపాలెం, చింతకాని మండలాలతో మధిర కొనసాగుతుంది. ఇల్లెందు నియోజకవర్గంలో కొత్తగా గుండాల మండలం కలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు పినపాక నియోజకవర్గంలో ఉన్న ఆ మండలం ఇల్లెందుకు వచ్చే అవకాశాలుంటాయి.
 
అయితే, ఇప్పటివరకు ఇల్లెందులో ఉన్న కామేపల్లి విడిపోతుంది. ఇల్లెందు, బయ్యారం, గార్ల, టేకులపల్లి, గుండాల మండలాలతో కలిపి ఇల్లెందు నియోజకవర్గం అవుతుంది. వైరా నియోజకవర్గం కూడా స్వరూపాన్ని మార్చుకోనుంది. ఆ నియోజకవర్గం నుంచి మూడు మండలాలు విడిపోయి రెండు మండలాలు కలవనున్నాయి. ఇప్పటివరకు వైరాలో ఉన్న ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లితో పాటు కామేపల్లిని కలుపుకుని ఏన్కూరు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటవుతుందని అంచనా. ఇక వైరాలో వైరా, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు మండలాలు ఉంటాయి. అదే జరిగితే సత్తుపల్లి మున్సిపాలిటీ, రూరల్, వేంసూరు, పెనుబల్లి మండలాలు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంటాయి.
 
అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఆంధ్రలో కలవనుండగా, మిగిలిన మండలాలతో (అశ్వారావుపేట, చంద్రుగొండ, ములకలపల్లి, దమ్మపేట) అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పాటు కానుంది. ఇక ముంపు ప్రాంతం కింద ఆంధ్రలోనికి వెళ్లే భద్రాచలం నియోజకవర్గంలోని మండలాలు పోను భద్రాచలం టౌన్, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలు భద్రాచలం అసెంబ్లీ పరిధిలో ఉంటాయి. పినపాక నుంచి గుండాల పోను మణుగూరు, పినపాక, బూర్గంపాడు (ఆరు గ్రామాలు ఆంధ్రలోనికి వెళ్తాయి.), అశ్వాపురం మండలాలతో ఈ నియోజకవర్గం కొనసాగుతుంది. కొత్తగూడెం మాత్రం యథావిధిగా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, మండలాలతో కలిపి కొనసాగుతుంది.
 
రిజర్వేషన్లలోనూ మార్పు!
పునర్విభజన జరిగితే అసెంబ్లీ నియోజకవర్గాల రిజర్వేషన్లలోనూ మార్పులు జరగనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే పాలేరు నియోజకవర్గంలో ముదిగొండ మండలం కలిస్తే అది ఎస్సీకి రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోని ఎస్సీ జనాభాలో ఉన్న 0.5 శాతం వ్యత్యాసం కారణంగా సత్తుపల్లి ఎస్సీకి రిజర్వ్ అయింది. అదే ముదిగొండ మండలాన్ని మళ్లీ పాలేరులో కలిపితే అదే వ్యత్యాసంతో పాలేరును ఎస్సీకి రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అలా జరిగితే మళ్లీ సత్తుపల్లి జనరల్ కావచ్చు.
 
ఇక, వైరాలో మార్పులు జరిగితే అది జనరల్‌కు రిజర్వ్ అవుతుందని, ఏన్కూరు కేంద్రంగా ఏర్పడే నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్ చేస్తారని అంచనా. మొత్తంమీద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల సంఖ్యలో మార్పుండదు కానీ ఈ రెండు నియోజకవర్గాల రిజర్వేషన్లు మారొచ్చని అంచనా. దీంతోపాటు కొత్తగా ఏర్పడే ఖమ్మం - 2, తోపాటు వైరా నియోజకవర్గాలు కూడా జనరల్‌కు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుడు జిల్లాలో జనరల్ నియోజకవర్గాల సంఖ్య ఐదుకు చేరుతుంది. ఇప్పటివరకు ఉన్న జనరల్‌స్థానాల కరువు కూడా తీరుతుంది. కాగా, తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మేరకు కొత్తగూడెం లేదా భద్రాచలం కేంద్రంగా మరో జిల్లా ఏర్పడినప్పటికీ..  నియోజకవర్గాలను రాష్ట్రం యూనిట్‌గానే పరిగణిస్తున్నందున  ఇందులో మార్పు ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు.
 
పార్లమెంటుకు రెండు చొప్పున..
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అంటే కొత్తగా 34 స్థానాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలుంటే, ఒక్కో ఎంపీ స్థానానికి రెండు  అసెంబ్లీ స్థానాల చొప్పున పునర్విభజన జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాల్సి ఉంటుంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో రెండు, మహబూబాబాద్ పరిధిలో ఓ స్థానం పెరిగే అవకాశం ఉన్నా, ముంపు ప్రాంతం కింద ఏడు మండలాల్లోని రెండు లక్షలకు పైగా జనాభా ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో ఒక నియోజకవర్గం తగ్గుతుందని అంచనా.
 
అసలేం జరుగుతుంది?
కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికిప్పుడే జరిగే అవకాశం లేదు. సీఎం రాసిన లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే దీనిపై సీఈసీ ఓ కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం పునర్విభజనపై కసరత్తు చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలా చేయాలి? ఎంత జనాభా యూనిట్‌గా వస్తుంది? దాన్ని బట్టి మండలాలు, గ్రామాల సరిహద్దులు చెరిగిపోకుండా జనాభా లెక్కకు మించకుండా శాస్త్రీయ పద్ధతిలో ఒక ప్రతిపాదనను తెస్తుంది. ఆ ప్రతిపాదన తయారు చేసే క్రమంలో అన్ని రాజకీయ పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుంటారు. అదే విధంగా అభ్యంతరాల నమోదును కూడా పరిశీలించి ఆ తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

మరిన్ని వార్తలు