సీఎం వరాల జల్లుపై సందేహాలెన్నో

18 Jul, 2014 02:08 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల పట్ల జిల్లా ప్రజల్లో ఆనందోత్సాహాలతో పాటు సందేహాలు, కొంతమేర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రుణమాఫీపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ రైతన్నల్లో భరోసా కలిగిస్తుండగా, మాఫీ అమలు చేయాల్సిన ఆర్‌బీఐ మార్గదర్శకాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇక తుపాను పీడిత మండలాలకు రుణాల రీషెడ్యూల్ అవకాశం ఉండడం జిల్లా రైతులకు కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ.. కౌలు రైతుల రుణాలపై స్పష్టత లేకపోవడంతో ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రుణమాఫీ ఎలా చేస్తారో ఆర్‌బీఐకి ప్రభుత్వం చెప్పేంతవరకు ఈ ఉత్కంఠ తప్పదని రైతు సంఘాలంటున్నాయి. ఇక, ఇంక్రిమెంట్  ప్రకటనతో తెలంగాణ ఉద్యోగులు హ ర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, సకలజనుల సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్ అమలవుతుందా? గతంలో ఆర్జిత సెలవు (ఈఎల్) కింద పరిగణించిన వేతనాన్ని తిరిగి చెల్లిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

1956కు ముందున్న విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని కేబినెట్‌లో నిర్ణయించడం జిల్లాలోని వేలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళంలో పడేసింది. ఉద్యోగాల నిమిత్తం పొరుగున ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా తదితర జిల్లాలకు వెళ్లి, 1956 తర్వాత తిరిగి వచ్చి స్థిరపడ్డ వారి పిల్లలు, ముఖ్యంగా 1959లో తెలంగాణలో కలిసిన భద్రాచలం డివిజన్‌లోని చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, వాజేడు, భద్రాచలం పట్టణానికి చెందిన విద్యార్థులకు సంబంధించి కూడా స్పష్టత రాలేదు.

ఈ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వస్తేనే వీరికి ఫీజులొచ్చేది లేనిది తేలుతుంది. అలాగే ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారి పిల్లలు చాలా మంది ఇక్కడే చదువుకుంటున్నారు. వారి పరిస్థితేంటో అర్థం కావడం లేదని, అక్కడి ప్రభుత్వమయినా వీరికి ఫీజులిస్తుందో, ఇవ్వదో స్పష్టత ఇవ్వాలని సంఘాల నాయకులంటున్నారు. ఇక, 500 పైబడి జనాభా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలన్న నిర్ణయంతో జిల్లాలో గ్రామపంచాయతీల సంఖ్య పెరగనుంది.

ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాలీలకు రవాణా పన్ను ఎత్తివేత, ఆర్‌ఎంపీ, పీఎంపీలకు సర్టిఫికెట్లు, కల్యాణ లక్ష్మి ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని యువతుల పెళ్లిళ్లకు రూ.50 వేలు ఆర్థికసాయం, సామాజిక పింఛన్ల పెంపు లాంటి అంశాలు జిల్లా వాసులకు మేలు చేయనున్నాయి. ఇక తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు సాయం, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత నిర్ణయాలు కూడా జిల్లాలోని వందలాది మందికి లబ్ధి చేకూర్చనున్నాయి.
 
రుణమాఫీ ఏ మేరకు...
 మంత్రివర్గ నిర్ణయం మేరకు జిల్లాలో ఇప్పటివరకు రైతులు తీసుకున్న రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలన్నీ రద్దవుతాయి. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, పాత బకాయిలూ కూడా రద్దవుతాయి. అలా రద్దు చేస్తే జిల్లాలోని 4.6 లక్షల రైతులకు చెందిన రూ.3,200 కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంటుంది. ఇందులో 3 లక్షల మంది రైతులు దాదాపు రూ. 1600 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు. బంగారం పెట్టి తీసుకున్న రైతులు 55 వేల మంది ఉండగా, వీరికి రూ.486 కోట్లు మాఫీ అవుతుంది.

 మిగిలిన దీర్ఘకాలిక రుణాల్లో వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కొనుగోలు నిమిత్తం తీసుకున్న రుణాల్లో లక్ష లోపు ఉంటేనే మాఫీ అవుతాయి. స్వల్పకాలిక రుణంతో పాటు దీర్ఘకాలిక రుణం తీసుకుని ఉంటే అది రూ.లక్ష దాటితే మాఫీ కాదని, ఏదో ఒకటే మాఫీ చేసుకోవాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెపుతున్నారు. మరోవైపు జిల్లాలోని 2,554 మంది కౌలురైతులు దాదాపు రూ. 11.2 కోట్ల రుణం తీసుకున్నారు. వీరి విషయంలో మంత్రివర్గం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక గత సంవత్సరానికి మాత్రమే మాఫీ వర్తిస్తే 2.36 లక్షల మంది రైతులకు చెందిన రూ.1266 కోట్లు మాత్రమే మాఫీ అవుతాయి. అదే ఏప్రిల్ 2013 నుంచి అక్టోబర్ 27 వరకు మాత్రమే తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేస్తే కొంతమేర తగ్గనుంది. మొత్తంమీద ఆర్‌బీఐకి ప్రభుత్వం లేఖ రాస్తే కానీ పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం లేదు.

 తండాలు పంచాయతీలయితే...
 మంత్రివర్గ నిర్ణయం మేరకు జిల్లాలోని 500పైగా జనాభా ఉన్న 1,046 తండాలను గ్రామపంచాయతీలుగా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 758 పంచాయతీలుండగా, అందులో పోలవరం ముంపు కింద 334 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తాయి. అవి వెళ్లినా ఈ 1046 పంచాయతీలు కలిస్తే జిల్లాలో 1470 పంచాయతీలవుతాయి.  

 పింఛన్‌దారులకు దసరా, దీపావళే..
  జిల్లాలోని దాదాపు 2.5 లక్షల మంది పింఛన్‌దారులకు దసరా-దీపావళి మధ్యలో పెన్షన్లను భారీగా పెంచాలన్న మంత్రివర్గం నిర్ణయం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది. ఇప్పటివరకు జిల్లాలో 1,09,213 మంది వృద్ధాప్య , 93,100 మంది వితంతు, 24,583 మంది వికలాంగ పింఛన్లు పొందుతున్నారు. వీరికి పింఛన్ పెంపు అమలయితే వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున అందుతాయి.

 రవాణా పన్ను రద్దుతో  34వేల మందికి ఊరట
  ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాలీల రవాణా పన్ను రద్దుతో దాదాపు 34వేల మందికి ఊరట కలగనుంది. ప్రస్తుతం జిల్లాలో రవాణా పన్ను కడుతున్న ఆటోలు 23,489 ఉండగా, రూ.1.3 కోట్లు వసూలవుతున్నాయి. 3,774 ట్రాలీలకు గాను రూ.80 లక్షల పైన, 7,269 ట్రాక్టర్లకు గాను రూ.87లక్షల పైన రవాణా పన్ను కింద వస్తోంది. ఈ పన్ను రద్దయితే రవాణా శాఖకు ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం తగ్గనుంది.

 ఇంక్రిమెంటు ఓకే... కానీ..
 తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ అమలు చేయాలన్న నిర్ణయంపై జిల్లాలోని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని శాఖల్లో కలిపి దాదాపు 27,287 మంది ఉద్యోగులుండగా, వీరికి నెలకు వేతనాల కింద రూ.108.53 కోట్లు చెల్లిస్తున్నారు. అయితే, ఈ ఇంక్రిమెంట్లు అమలు సకల జనుల సమ్మెలో పాల్గొనని వారికి కూడా ఇస్తారా అనే సందేహాన్ని ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సకలజనుల సమ్మె జరిగిన 42 రోజులను ఆర్జిత సెలవుగా పరిగణించి వేతనాన్ని ఇచ్చే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మరి ఇంక్రిమెంట్‌తో పాటు ఆ వేతనం కూడా ఇస్తారా లేక ఇంక్రిమెంట్‌తోనే సరిపెడతారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

 59 కేసులు... 264 మంది
 తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలన్న మంత్రివర్గ నిర్ణయం మేరకు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 59 కేసులు ఎత్తివేయనున్నారు. వీటిలో నిందితులుగా పేర్కొన్న 264 మందికి ఊరట కలగనుంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సాయం చేస్తామన్న నిర్ణయంతో జిల్లాలో దాదాపు 10 మంది అమరవీరుల కుటుంబాలకు మేలు చేకూరనుంది. ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలన్న నిర్ణయం జిల్లాలోని దాదాపు 5వేల మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలకు సంతోషాన్ని కలిగిస్తోంది. అదే విధంగా కల్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని వధువులకు రూ.50వేల ఆర్థిక సాయం పథకాన్ని దళిత, గిరిజనులతో పాటు అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి.

 ‘ఫీజు’కు తిప్పలే...
  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద లబ్ధి పొందాలంటే 1956కు ముందునుంచే తెలంగాణలో ఉండాలన్న నిర్ణయం జిల్లా వాసుల్లో కొందరికి ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ఉద్యోగాల కోసం 1956 తర్వాత వచ్చి ఇక్కడ స్థిరపడినవారు, ఇతర జిల్లాల నుంచి వలస వచ్చి జీవిస్తున్న వారి పిల్లలకు ప్రభుత్వ సాయం అందే పరిస్థితి ఉండదు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంటుందని అంచనా. మరోవైపు 1959లో తెలంగాణ ప్రాంతంలో కలిసిన భద్రాచలం డివిజన్ పరిధిలోని విద్యార్థుల పట్ల ఎలాంటి నిబంధనలు విధిస్తారన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు