సర్వసభ్య సమావేశం అనుమానమే?

23 Nov, 2014 00:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ చివరి పాలకమండలి సమావేశం జరుగుతుందా? చివరి భేటీలో అధికారుల తీరును ఇరుకున పెట్టాలనుక్ను ప్రజాప్రతినిధుల ఆశలు అడియాలు కానున్నాయా? కీలక అంశాలు చర్చించకుండానే పాలక మండలి గడువు ముగియనుందా?ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికార వర్గాలు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు వచ్చేనెల 3వ తేదీతో ముగుస్తోంది. ఆలోగా చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించాలనుకున్నారు.

నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు జీహెచ్‌ంఎసీ సర్వసభ్య సమావేశం నిర్వహించకూడదు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్‌అఫీషియో సభ్యులు సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా ఈ నిబంధన రూపొందించారు. ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈనెల 22  వరకే అసెంబ్లీ జరగాలి. దీంతో 29న జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశానికి మేయర్ తేదీని ఖరారు చేశారు.

తాజాగా అసెంబ్లీ సమావేశాలు 29వ తేదీ వరకు జరిపేందుకు నిర్ణయించడంతో సర్వసభ్య సమావేశం జరిపేందుకు వీల్లేకుండా పోయింది. ఆ తర్వాతనైనా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలనుకుంటే.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలకమండలి గడువు ముగిసేలోగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. ప్రత్యేక అనుమతులతో తప్ప జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగే  అవకాశం లేదు. చివరి సమావేశంలో తీవ్రంగా స్పందించాలని పలువురు ప్రజాప్రతినిధులు భావించా రు.

ఆమేరకు ప్రణాళికలు సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. మేయర్‌కు, కమిషనర్‌కు మధ్య అభిప్రాయభేదాలు బహిరంగం కావడంతో  చివరి సర్వసభ్యసమావేశంలో అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య యుద్ధం జరగగలదనే చర్చ జరిగింది. తీరా సర్వసభ్య సమావేశమే జరగని పరిస్థితి ఎదురవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటుండగా... ఎలాగైనా సమావేశాన్ని జరపాలనే యోచనలో కొందరు ఉన్నారు.  అందుకు తగ్గ అవకాశాలేమైనా ఉన్నాయేమోననే ఆలోచనలో పడ్డారు.

మరిన్ని వార్తలు