రోడ్డు ప్రమాదంలో సుధీర్‌రెడ్డి మృతి : ప్రమాదంపై అనుమానాలు

24 Dec, 2014 03:16 IST|Sakshi
సుధీర్ రెడ్డి మృతదేహం

తరాలపల్లి వద్ద మొరంకట్టను ఢీకొన్న మోటార్ సైకిల్
 
 మడికొండ(వరంగల్ జిల్లా): వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి(36) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హన్మకొండ మండలం తరాలపల్లి వద్ద జరిగిన దుర్ఘటనకు సంబంధించిన వివరాలు... క్వారీ పనులను పర్యవేక్షించేందుకు  సుధీర్‌రెడ్డి మంగళవారం స్వగ్రామమైన మల్లక్కపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. సాయంత్రం  మల్లక్‌పల్లి నుంచి మీదుగా హన్మకొండ వైపు వస్తున్నారు.  తరాలపల్లి గ్రామంలో కల్వర్టు పనులకు పోసిన మొరం కట్ట మీద నుండి బండితో సహా పల్టీకొట్టారు. దీంతో సుధీర్‌రెడ్డి తల రోడ్డుకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మడికొండ సీఐ డేవిడ్‌రాజ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలిం చారు. సుధీర్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం మల్లక్కపల్ల్లిలో జరగనున్నాయి.

కాగా,  సుధీర్ రెడ్డికి జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని సీఐ డేవిడ్ రాజు చెప్పారు.  ఈ రోడ్డు ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని  ఎస్పీ అంబర్ కిషోర్ ఝా  సీఐని ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన రెడ్డి, డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శించారు.

  జగన్ సంతాపం
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నేత సుధీర్‌రెడ్డి మరణించడం పట్ల పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సుధీర్‌రెడ్డి మరణం పట్ల వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి సంతాపాన్ని ప్రకటించారు.

ఉప ముఖ్యమంత్రి రాజయ్య సంతాపం

సుధీర్ రెడ్డి మృతికి ఉపముఖ్యమంత్రి రాజయ్య, మంద్రి చందూలాల్, ఎమ్మెల్యే లు సురేఖ, వినయ్య భాస్కర్,రమేష్, ఎంపిలు కడియం శ్రీహరి, సీతారామ్ నాయక్, టీఆర్ఎస్ నేతలు మురళీధర్ రావు, రవీంద్ర రావు, కుడా మాజీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, వైఎస్ఆర్ సీపి నేతలు గట్టు శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నాడెం శాంత కుమార్, సింగిరెడ్డి భాస్కర రెడ్డి, డాక్టర్ ప్రపుల్లా రెడ్డి, చల్లా మధుసూధన్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, డీసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, టీపిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస రావు, టీడీపి జిల్లా ఉపాధ్యక్షుడు ఖాదర్ అలీ, అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు