మహాగణపతి ఉత్సవాలపై మల్లగుల్లాలు

20 May, 2020 07:56 IST|Sakshi

రద్దు అని ప్రకటించిన రెండ్రోజులకే కర్రపూజ

కమిటీ సభ్యుల ఆగ్రహం

ఖైరతాబాద్‌: ఒక అడుగు నుంచి మొదలుకొని గత 66 ఏళ్లుగా అందరినీ ఆకట్టుకుంటూ.. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులచే విశేష పూజలందుకుంటూ ఖైరతాబాద్‌ మహాగణపతి ప్రసిద్ధి చెందాడు. అంతటి ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులకు ఏటా తొలి ఏకాదశి రోజు కర్ర పూజతో శ్రీకారం చుడతారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్‌ నేపథ్యంలో ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవాలు నిర్వహించాలా..? వద్దా..? అన్న సంశయం నెలకొంది.

ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రస్తుతానికి మహాగణపతి తయారీ పనులను ప్రారంభించవద్దని సూచించారు. అయితే అప్పటికే 18న కర్రపూజ నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో పోలీసు అధికారుల సూచనల మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్, కన్వీనర్, కార్యదర్శులు కర్రపూజను రద్దు చేస్తున్నామని మరో ప్రకటన చేశారు. 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైనందున  ఈ సంవత్సరం ఒక్క అడుగుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అంతేగాకుండా మట్టితో మహాగణపతి తయారు చేసి ఆదర్శంగా నిలుస్తామని వారు మీడియాకు తెలిపారు. కాగా అదే రోజు రాత్రి మహాగణపతి ఎత్తు ఒక్క అడుగు కాదు 11 అడుగులతో ప్రతిష్టిస్తామని వారు మరో ప్రకటన చేశారు. కమిటీ ఎవరితో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడంపై ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు మహేష్‌యాదవ్‌తో పాటు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సమాచారం లేకుండానే కర్రపూజ  
ఈ నెల 18వ తేదీ తొలి ఏకాదశి రోజున నిర్వహించాల్సిన కర్రపూజను కరోనా నేపథ్యంలో నిర్వహించడం లేదని ప్రకటించిన రెండు రోజులకే ఉత్సవ కమిటీకి కనీస సమాచారం లేకుండా కర్రపూజను నిర్వహించడం పట్ల స్థానికులు, కమిటీ సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో  భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే అంశంపై ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించకుండా పూటకో ప్రకటన చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

మరిన్ని వార్తలు