బాధ్యత మనదే.. భద్రతా మనదే!

14 Jun, 2020 03:16 IST|Sakshi

అందరూ రక్షితులయ్యే వరకూ... కరోనా నుంచి ఎవరూ సురక్షితులు కారు 

జూలై రెండోవారానికల్లా దేశంలో 10 లక్షల కేసులకు చేరువయ్యే అవకాశాలు 

సాక్షి ఇంటర్వ్యూలో ప్రముఖ వైద్యులు డా.దశరథరామారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘కోవిడ్‌–19’మహమ్మారి విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు, తమ భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు, సోషల్‌ యాక్టివిస్ట్‌ డా.దశరథరామారెడ్డి తేతాలి సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమకేమీ కాదన్న చందంగా ఎవరూ వ్యవహరించడం సరికాదని, 90%కి పైగా ప్రజలు జాగ్రత్తలు తీసుకుని మిగతా కొంతశాతం మంది విచ్చలవిడిగా వ్యవహరించడం వల్లనే సమస్య తీవ్రమౌతోందన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మనదేశంలో దాదాపు 3 నెలల పాటు విస్తృత ప్రచారాలు నిర్వహించారని, ప్రపంచంలోని ఏ ప్రభుత్వాలు కూడా ఇంత కంటే ఎక్కువ చేయలేవన్నారు.ముంబై, ఢిల్లీ, చెన్నైలతో పోల్చితే హైదరాబాద్, కోల్‌కత్తాల్లోని వైరస్‌ ‘విరులెంట్‌ స్ట్రెయిన్స్‌’ తక్కువ తీవ్రతతో ఉన్నందువల్ల పరిస్థితి ఇంకా దిగజారలేదని చెప్పారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరగడం వల్ల తలెత్తిన పరిణామాలు, చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై ‘సాక్షి’ఇంటర్వ్యూలో డా. దశరథరామారెడ్డి వివరించారు.  

మూడు ‘ఆర్‌’ల సిద్ధాంతం... 
కోవిడ్‌ కారణంగా ఇప్పటివరకు ఎదురైన పరిస్థితులు, చేదు అనుభవాలను అధిగమించి ఇకముందైనా పరిస్థితులకు తగ్గట్టుగా మసలుకునేందుకు రీడెడికేట్, రీ డిఫైన్, రీ ఇన్వెంట్‌ చేస్తూ ‘త్రీ ఆర్‌’సిద్ధాంతాన్ని పాటించాలి. పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేసుకుని పునరంకితం (రీ డెడికేట్‌) కావాలని, మన ఆలోచనలు,ఊహలు, అవసరాలను మార్చుకుని పునర్‌నిర్వచనం ( రీడిఫైన్‌) చేసుకోవాలి, కొత్తగా ఆలోచించి, ఆడంబరాలకు పోకుండా అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్తు భద్రంగా ఉండేలా మళ్లీ కొత్తపోకడలకు అనుగుణంగా కొత్తగా ఆవిష్కరించుకోవాలి (రీఇన్వెంట్‌).  

డబ్ల్యూహెచ్‌వో, ఇతర ఆరోగ్యసంస్థల అంచనాల ప్రకారం జూలై చివరకల్లా భారత్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య 10 నుంచి 12 లక్షలకు చేరొచ్చని అంచనా. ప్రస్తుత కేసుల వేగాన్ని బట్టి చూస్తే జూలై మధ్యకల్లా 10 లక్షలకు చేరవచ్చు. 

అలా గుమిగూడటం భయంకరం... 
ఈ మధ్యే హైదరాబాద్‌లోని ఓ చేపల బజారులో జనం పెద్దసంఖ్యలో గుమికూడిన తీరు అత్యంత భయంకరం. మనం ఓ మహమ్మారితో కొట్టుమిట్టాడుతున్నామనే కనీస జ్ఞానం, ధ్యాస లేకుండా, వ్యక్తుల మధ్యదూరం లేకుండా వ్యవహరించడం బాధాకరం.ప్రజల బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనం.పాజిటివ్‌ వ్యక్తి వారిలో ఉంటే తనకు తెలియకుండానే ఇతరులకు సోకేలా చేస్తుండడమే అసలు సమస్య. అన్ని జాగ్రత్తలతో ఇంటి వద్దనే ఉండటం శ్రీరామరక్ష. 

ఇది తొలి విపత్తు మాత్రమే... 
భవిష్యత్తులో మరిన్ని ఉపద్రవాలు రావొచ్చు. ప్రకృతిని వినాశనం చేస్తే ఏమవుతుందనేది తెలుసుకున్నాం. ఇకనైనా జాగ్రత్త వహిద్దాం. ఇప్పుడు అన్ని కుటుంబాలు ఆర్థికపరంగా ప్రభావితమయ్యాయి. మధ్యతరగతి పరిస్థితి బీపీఎల్‌ స్థాయికి దిగజారుతోంది. కింది తరగతుల వారిపై మరింత తీవ్రంగా పడింది. అందువల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. 

అంచనాలు మారాయి... 
అన్నింటికి కర్త,కర్మ,క్రియ మనమే అని గ్రహించాలి. ప్రతీ విషయంలో జాగ్రత్త అవసరం. సిగరెట్, మద్యపానం వంటి అలవాట్ల వల్ల ఈ వైరస్‌ సులభంగా సోకవచ్చు. పెద్దవయసు వారికే ప్రమాదం అనే అంచనాలున్నాయి. దానికి భిన్నంగా 20 నుంచి 40 వయసున్న వారు ఇటీవల ఈ వ్యాధితో మరణించడం దురదృష్టకరం. మండువేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగితే వైరస్‌ తగ్గుముఖం పడుతుందని ప్రచారం జరిగింది. మరి మే చివర్లోనే కేసులు రెట్టింపయ్యాయి. అందువల్ల వర్షాకాలంలో ఇలా అవుతుంది, చలికాలంలో ఇంకా పెరుగుతుంది అనే భయాలొద్దు. అలాగని అశ్రద్ధా చేయొద్దు.  

మెరుగైన వ్యాక్సిన్‌ ఎప్పటికో చెప్పలేం... 
ఇదొక నిలకడలేని జన్యువు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 198 రకాల కోవిడ్‌ వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక దానికి తయారు చేసిన వ్యాక్సిన్‌ మరోదానికి పనికిరాదు. అందువల్ల ప్రయోగాలు వివిధదశల్లో ఉన్నా మెరుగైన వ్యాక్సిన్‌ ఎప్పటికో చెప్పలేము. ఈ వైరస్‌ల సీక్వెన్సింగ్, స్ట్రెయిట్లు మారిపోవడం వల్లనే వ్యాక్సిన్లు, మందులు కనుక్కోవడం కష్టమవుతోంది.

నోబడి ఈజ్‌ సేఫ్‌... 
ఇప్పుడున్న దురదృష్టకర పరిస్థితుల్లో ఊహించడానికే బాధగా ఉన్నా మనపక్కన మెదిలే ప్రతీ వారిని కోవిడ్‌ పాజిటివ్‌గానే పరిగణించాలి. అందరూ భద్రం, సురక్షితం అని తేలే వరకు ఎవ్వరూ సురక్షితం కారు (నోబడి ఈజ్‌ సేఫ్‌ అంటిల్‌ ఎవ్రీబడి ఈజ్‌ సేఫ్‌). అంతేకాకుండా కీడెంచి మేలెంచు అన్న దాన్ని మననం చేసుకుంటూ అందరినీ గౌరవిస్తూనే, అందరినీ కోవిడ్‌ పాజిటివ్‌లుగా అనుమానించాల్సిన (రెస్పెక్ట్‌ ఆల్‌.. సస్పెక్ట్‌ ఆల్‌) పరిస్థితులు ఏర్పడటాన్ని గమనించాలి.

>
మరిన్ని వార్తలు