అందరూ ఆ కాలేజీ పక్షులే!

10 Jul, 2018 01:11 IST|Sakshi

‘ఎంసెట్‌ లీకేజ్‌’ కేసులో డాక్టర్‌ గణేశ్‌ ప్రసాద్‌ అరెస్ట్‌

ఇతడు శ్రీచైతన్య పూర్వ విద్యార్థి

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో మరో కీలకమైన లింకు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి శ్రీచైతన్య కాలేజీలో డీన్‌గా పని చేసిన వాసుబాబు ఇప్పటికే అరెస్ట్‌ కాగా.. తాజాగా అదే కాలేజీలో చదువుకుని వైద్య విద్య ఫైనలియర్‌ చదువుతున్న విజయవాడకు చెందిన డాక్టర్‌ గణేశ్‌ ప్రసాద్‌ అరెస్టవడం సంచలనం రేపు తోంది. ప్రస్తుతం కర్ణాటక ధావనగిరిలోని మెడికల్‌ యూనివర్సిటీలో గణేశ్‌ చదువుతున్నాడు. ఇతడి సోదరుడు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేయ గా, ఎంసెట్‌ రాసేందుకు సిద్ధమయ్యాడు.

గణేశ్‌ తన స్నేహితులతో కలసి ఎంసెట్‌ ప్రశ్నపత్రంపై భువనేశ్వర్‌లో క్యాంపు నిర్వహించాడు. తన సోదరుడితోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి, డోర్నకల్‌కు చెందిన మరో విద్యార్థిని క్యాంపునకు తీసుకెళ్లాడు. వారితో రూ.30 లక్షలకు డీల్‌ కుదుర్చుకుని.. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు వసూలు చేసినట్టు సీఐడీ విచారణలో బయటపడింది. డాక్టర్లు సందీప్, ధనుం జయ్‌లతో వాసుబాబుకు లింకు బయటపడటం, వాసుబాబుతో గణేశ్‌ లింకు బయటపడటంతో అధికారులకు క్లారిటీ వచ్చినట్లు సమాచారం.  

ర్యాంకుల వెనుక గుట్టు
శ్రీచైతన్య మాజీ డీన్‌ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్‌ శివనారాయణ అరెస్ట్‌తో.. తీగ లాగితే డొంక కదిలినట్టు చిట్టా బయటపడుతోంది. శివనారాయణ లింకులో బిహార్‌కు చెందిన మరో డాక్టర్, ఇద్దరు బ్రోకర్ల పాత్ర వెలుగులోకి రావాల్సి ఉందని సీఐడీ భావిస్తోంది. దీంతో వాసుబాబుతోపాటు శివనారాయణను మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గణేశ్‌ అరెస్ట్‌తో నిందితుల జాబితా 90కి చేరింది.

మరిన్ని వార్తలు