మూకుమ్మడి భేటీలతోనే ‘వైరల్‌ లోడ్‌’ 

6 Apr, 2020 02:57 IST|Sakshi

మూకుమ్మడి భేటీలతోనే ‘వైరల్‌ లోడ్‌’

ఎక్కువ మంది గుమికూడటం మంచిది కాదు

అంతర్జాతీయ వైద్య నిపుణుడు డా.శ్రీనాథరెడ్డి

శ్రీనాథరెడ్డి, డాక్టర్‌ మూర్తిలతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను బలహీన పర్చడమే మనముందున్న మార్గమని వైద్య నిపుణులు డాక్టర్‌ కె. శ్రీనాథరెడ్డి, డాక్టర్‌. జీవీఎస్‌. మూర్తిలు వెల్లడించారు. మూకుమ్మడి భేటీలతో ఈ వైరల్‌ లోడ్‌ను ఉధృతం చేయొద్దని, ఇది అత్యంత ప్రమాదకరమని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అంతర్జాతీయ వైద్యనిపుణుడు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని యూనివర్శిటీల్లో ప్రొఫెసర్‌గా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధిగా, ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌. శ్రీనాథరెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ డాక్టర్‌. జీవీఎస్‌ మూర్తిలతో ఆదివారం భేటీ అయి చర్చించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్‌. శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ క్రియాశీలకంగా పనిచేస్తున్నారని, దేశానికే దిశానిర్దేశం చేసే విధంగా రాష్ట్రం ముందుకెళుతోందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన సూచించారు. భౌతికదూరాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు నడుం బిగించాలని, ఎక్కువ మంది గుమికూడటం మంచిది కాదని చెప్పారు. వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడు ప్రజల సహకారం కూడా అవసరమని, వైద్య నిపుణుల సలహాలతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

మరిన్ని వార్తలు